Son kidnapped Parents: పున్నామ నరకం నుంచి రక్షించేవాడిని కొడుకు అంటారు. కానీ కొద్దిమంది కొడుకులు తల్లిదండ్రులను రోడ్డు పాలు చేస్తున్నారు. నవమాసాలు మోసి, తిని తినకా, కాయాకష్టం చేసి పెంచిన కొడుకులు.. ఆస్తి కోసం తల్లిదండ్రులనే అంతమొందిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ కొడుకే ఆస్తిని తన పేరున రాసివ్వడం లేదని సుపారి గ్యాంగ్‌తో కిడ్నాప్ చేయించడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసులు రాకతో సీన్ రివర్స్ అయ్యి అసలు బాగోతం బయటపడింది. అసలేం జరిగిందంటే..
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మల్లేపల్లికి ఫ్యాక్షన్ గ్రామం అని సమాచారం. ఈ గ్రామంలో రాత్రి పూట పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారు. ఈ గ్రామంలో నాగేశ్వరరావు, లక్ష్మీదేవి అనే వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. వారికి కొడుకులు, కూతుళ్లు ఉన్నారు. కాగా ఆ దంపతుల పేరు మీద ఉన్న విలువైన స్థలంపై చిన్న కొడుకు తిప్పరాజు కన్నేశాడు. ఆ స్థలాన్ని కొట్టేసేందుకు రకరకాల ప్లాన్లు వేశాడు. ఆ స్థలాన్ని తన పేరున రాసి ఇవ్వాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు వాళ్లు అంగీకరించలేదు. ఉన్న స్థలాన్ని కాస్తా రాసిస్తే తాము ఎలా బతకాలని వారు ప్రశ్నించారు. దీంతో ఎలాగైనా వాళ్ల నుంచి ఆ స్థలాన్ని తన పేరున రాయించుకోవాలనుకున్నాడు. కిడ్నాప్ చేయించి బలవంతంగా అయినా సరే ఆస్తి కాగితాల మీద సంతకం పెట్టించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
అనుకున్నదే తడవుగా సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దింపాడు. తన తల్లిదండ్రులను కిడ్నాప్ చేయాలని ఓ ఆరుగురికి సుపారీ ఇచ్చాడు. చేసుకున్న ఒప్పందం ప్రకారం గ్రామానికి ఓ వాహనంలో కిడ్నాపర్లు వచ్చారు. అడ్రస్ ప్రకారం వాళ్ల ఇంటికి వెళ్లి.. తిప్పరాజు తల్లిదండ్రులను బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని వెళ్తుండగా.. అదే సమయంలో బందోబస్తు కోసం వస్తున్న పోలీసులు.. గ్రామంలోకి కొత్త వాహనం రావడాన్ని గమనించారు. వెంటనే అప్రమత్తమై వెళ్లి నిలదీయగా కిడ్నాపర్లు తడబడ్డారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన పద్ధతిలో విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో కిడ్నాప్ వ్యవహారం బట్టబయలైంది.
ఆ దంపతులను విచారించగా చిన్న కుమారుడు తిప్పరాజుతో పాటు ఆరుగురు వచ్చి తమ పేరున కోడుమూరులో ఉన్న రూ.60 లక్షల విలువ గల ప్లాటు, మల్లెపల్లిలో ఉన్న ఐదు ఎకరాల పొలాన్ని(50 లక్షల విలువ) బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు తమను బెదిరించి కోడుమూరుకు తీసుకుని వెళ్లేందుకు యత్నిస్తున్నారని వారు తెలిపారు. దీంతో సుపారీ గ్యాంగ్‌ను అలాగే తిప్పరాజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కన్నకొడుకు నుంచే ఇబ్బందులు ఎదురవుతుండటంతో తమను ఎలాగైనా కాపాడాలని ఆ దంపతులు వేడుకుంటున్నారు.