వినాయక చవితిని ఇళ్లలోనే నిర్వహించుకోవాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భాజపా ఆదివారం కర్నూలులో చేపట్టిన నిరసనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సాయంత్రం 4గంటలకు నగరంలోని రాజ్‌విహార్ కూడలి నుంచి వినాయకుడి విగ్రహంతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి శబరి.. వందలాది కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరారు. రాజ్‌విహార్ కూడలిలోనే విష్ణువర్ధన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని రెండో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. కలెక్టరేట్‌ను ముట్టడించాలన్న నిర్ణయంతో వెళుతున్న భాజపా నాయకులను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. మార్గమధ్యంలో శ్రీకృష్ణదేవరాయల కూడలి వద్ద సోమువీర్రాజును అరెస్టు చేసి తాలూకా స్టేషన్‌కు తరలించారు. రాజ్‌విహార్ కూడలి నుంచి కలెక్టరేట్ వద్దకు చేరుకున్న భాజపా కార్యకర్తలు, నాయకులు అక్కడే అరెస్టులపై రాత్రి ఏడింటి వరకు ధర్నా నిర్వహించారు.
తోపులాటలో బైరెడ్డి శబరికి స్వల్పగాయాలు
సుమారు వంద మందిని అరెస్టు చేసి తరలిస్తున్న వాహనాలకు కార్యకర్తలు అడ్డుగా వెళ్లడంతో తోపులాట చోటు చేసుకుంది. బైరెడ్డి శబరి చేతికి స్వల్ప గాయాలవ్వడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రాజ్‌విహార్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు చేపట్టిన 4గంటల ఆందోళనల్లో అడుగడుగునా ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ నేతను విడుదల చేయాలని, వినాయక చవితి మండపాలకు అనుమతివ్వాలంటూ కొందరు భాజపా కార్యకర్తలు కలెక్టరేట్ సమీపంలోని సెల్‌టవర్ ఎక్కారు.
ఇదీ చదవండి: AP BJP: నేడు కలెక్టరేట్ల ఎదుట భాజపా ధర్నా