కర్ణాటక భాజపా నేత గాలి జనార్దన్ రెడ్డి మామ (భార్య తండ్రి) పరమేశ్వర రెడ్డిని బెదిరించిన నలుగురిని... కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ అంబర్‌పేటకు చెందిన మహమ్మద్ నజీర్, లంగర్‌హౌస్‌కు చెందిన గంగ అలియాస్ సంగీతారెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లరేవుకు చెందిన పెంకే శ్రీమన్నారాయణమూర్తి, పెంకే లక్ష్మీ కలిసి..
కర్నూలు జిల్లా బండిఆత్మకూరు కాకనూరు గ్రామంలో నివాసముంటున్న పరమేశ్వరరెడ్డి ఇంటికి వెళ్లి బెదిరించారు.
గాలి జనార్దన్ రెడ్డి భార్య 28 సంవత్సరాల కిందట కవల ఆడ పిల్లలను ప్రసవించిందని వారిలో గంగ అలియాస్ సంగీతా రెడ్డి ఒకరని చిత్రాలు చూపించారు. మనవరాలుగా స్వీకరించాలని డిమాండ్ చేశారు. పుట్టిన వెంటనే కవలల్లో ఒకరిని ఆస్పత్రి నర్సు ఎత్తికెళ్లి తర్వాత ఇచ్చినట్లు కథ రచించారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో చెప్పి పరువు మర్యాదలకు భంగం కలిగిస్తామని బెదిరించారు. 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అనుమానాస్పదంగా ఉన్న వీరితీరుపై పరమేశ్వరరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరిపి నలుగురిని అరెస్టు చేసినట్లు నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి తెలిపారు. మహమ్మద్ నజీర్, గంగ అలియాస్ సంగీత రెడ్డి భార్య భర్తలు. వారి ఇంట్లో పని మనుషులుగా శ్రీమన్నారాయణ మూర్తి, లక్ష్మీ ఉన్నారు. యూట్యూబ్ ఛానెల్లో గాలి జనార్ధన్ రెడ్డి వివరాలు సేకరించారు. గాలి జనార్దన్ రెడ్డి మామ పరమేశ్వర రెడ్డి... బండిఆత్మకూరు మండలం కాకనూరు గ్రామంలో ఉంటారని తెలుసుకుని ఇలా చేశారని పోలీసులు వివరించారు.
ఇదీ చదవండి: