కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరి సమీపంలో సోమవారం రాత్రి చిరుతపులి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఆదోని-ఎమ్మిగనూరు ప్రధాన రహదారి పక్కనున్న పొలాల్లో చిరుత కళేబరాన్ని గ్రామస్థులు గుర్తించారు. ఈ విషయాన్ని గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో.. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు.. చిరుత మృతదేహాన్ని పరిశీలించి గ్రామస్థులను విచారించారు.
చిరుత ఎలా మృతిచెందిందో తెలియరాలేదు. చిరుత వయస్సు 5 నుంచి 6 సంవత్సరాలు ఉండవచ్చని తెలుస్తోంది. అనంతరం చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకొని ఆదోనిలోని అటవీ శాఖ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈ విషయంపై అటవీ శాఖ రేంజ్ అధికారిణి స్ఫూర్తి మాట్లాడుతూ.. చిరుత అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు గుర్తించామన్నారు. పశువైద్యాధికారితో శవపరీక్ష నిర్వహించిన అనంతరం పూర్తివివరాలు వెల్లడిస్తామన్నారు.
ఇదీ చదవండి: చిత్తూరు జిల్లాలో.. ఆవుపై చిరుతపులి పంజా!