Pulikunta Pond Encroachment: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో అత్యంత విలువైన ప్రదేశంలో ఉంది ఈ పులికుంట చెరువు. ఇది ఒకప్పుడు సాగునీటి చెరువు. దీనికింద దాదాపు 150 ఎకరాల ఆయకట్టు ఉండేది. కుంటపై ఆధారపడి 16 పేద కుటుంబాలు జీవించేవి. ఎన్నో ఏళ్ళుగా ఆ కుంటను వారే సాగు చేస్తున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక వారిని ఖాళీ చేయించింది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా దాన్ని జగనన్న కాలనీలుగా పంపిణీ చేయాలని భావించింది. రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పంపిణీ తాత్కాలికంగా ఆగింది. కానీ 2020 నుంచి రైతులను ఆ భూమిని సాగు చేయకుండా పడావు పెట్టారు. అదే స్థలంపై ఇప్పుడు అధికార వైసీపీ నేతల కన్ను పడింది. కబ్జాకు పక్కా స్కెచ్ వేశారు. ఇప్పటికే రహదారి పేరుతో కొంత ఆక్రమించారు. మిగిలినదాన్ని మింగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ పులికుంట చెరువు.. విస్తీర్ణం 10.10 ఎకరాలు. క్రమేణా చెరువు ఒట్టిపోవడంతో కేసరపల్లిలో భూమిలేని వ్యవసాయ కూలీలు.. తలాకొంత సేద్యం చేసుకుంటూ జీవించేవారు. రెవెన్యూ దస్త్రాల్లో అనుభవదారులుగా 16 మంది పేర్లు ఉండేవి. ఈ ప్రాంతానికి అతి చేరువలోనే మేథా టవర్ నిర్మించారు. ఓ వైపు జాతీయ రహదారి, మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా చెంతనే ఉండటంతో ఇక్కడ స్థలాల ధరలు కోట్లకు చేరాయి.
దొరికిందే అదునుగా స్థిరాస్తి వ్యాపారులు గ్రావెల్‌తో రోడ్డు వేసేశారు. అంతే కాదు.. నాలుగేళ్ల వరకు రైతులు వరిసాగు చేసే ఈ భూముల్లో ఏకంగా ఒక డొంక రోడ్డు కూడా వేశారు. ప్రజాప్రతినిధి అనుచరుల వెంచర్లకు వెళ్లేందుకే ఈ దారి వేశారని స్థానికులు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు కోర్టును ఆశ్రయించడంతో వారిపై అధికారులు కక్ష కట్టారు. కేసు విచారణలో ఉండగానే రైతుల్ని ఆ భూమిలోకి రానీయకుండా ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టారు.
దీంతో వ్యవసాయం మీదే ఆధారపడే అన్నదాతలు.. నాలుగేళ్లగా పంట సాగు చేయలేకపోవడంతో లక్షల్లో ఆహార ఉత్పత్తులు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాల జీవనం గగనమైందని వాపోయారు. ఓ వైపు రైతులకు, ప్రభుత్వానికి వివాదం నడుస్తుంటే.. మధ్యలో స్థిరాస్తి వ్యాపారులు రంగప్రవేశం చేశారు. ఓ ప్రజాప్రతినిధి సిఫార్సులతో ఆ ప్రాంతంలో విద్యుత్తు లైను కూడా వేయించారు. ఇప్పటికే రోడ్డు పేరుతో ఎకరం వరకు ఆక్రమించేశారు.
మరో 4 ఎకరాలను ఆక్రమించేందుకు యత్నిస్తున్నారు. అన్ని నీటి వనరుల తరహాలోనే దీనిని కూడా కుంచించుకుపోయిందని చెప్పి.. కబ్జా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇంత రాద్ధాంతం జరుగుతున్నా.. పులికుంట చెరువు విస్తీర్ణంపై అధికారులు సర్వే చేయకపోవడం అనుమానాలు తలెత్తుతున్నాయి.