విజయవాడ నగరపాలక ఎన్నికలు రోజురోజుకు కాకరేపుతున్నాయి. నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచీ పార్టీలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థుల తరపున మంత్రి కన్నబాబు ప్రచారం నిర్వహించారు. భవానీపురం, కొండవీడు అకాడమీ ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే విష్ణుతోపాటు... తూర్పు నియోజకవర్గంలో వైకాపా నేత దేవినేని అవినాష్ ప్రచారంలో పాల్గొన్నారు. విజయవాడ నగర అభివృద్ధికి సీఎం 600 కోట్లు నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే విష్ణు తెలిపారు.
వైకాపా మరో కుట్ర
నగరపాలక సంస్థలో మరోసారి పట్టు నిలుపుకునేందుకు తెదేపా తీవ్రంగా కృషి చేస్తోంది. సెంట్రల్ నియోజకవర్గంలో ఆ పార్టీ నేత బొండ ఉమ ప్రజా చైత్యన్య యాత్రలో పాల్గొన్నారు. 30వ డివిజన్, 57వ డివిజన్లలో తెలుగుదేశం అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగారు. ఎన్నికలు అవ్వగానే కార్పొరేషన్లలో ఇంటిపన్ను, నీటిపన్ను, మురుగునీటి పన్ను భారీగా పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైందని వారు ఆరోపించారు.
బీవీ రాఘవులు ప్రచారం
విజయవాడ వన్‌టౌన్‌లో సీపీఎం సీనియర్ నేత బీవీ రాఘవులు ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
గుంటూరులోనూ ప్రచారం ఊపందుకుంది. వైకాపా అభ్యర్థులు తరపున ఎమ్మెల్యే మద్దాలి గిరి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పోలవరం నుంచి అనుసంధానానికే ఏపీ ఓటు