public school students as global citizens: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్‌గా తీరిదిద్దేందుకు ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, గ్లోబల్ టెక్ కంపెనీల ప్రతినిధులతో ఉన్నత స్థాయి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేశారు. వర్కింగ్ గ్రూపులో మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ఇంటెల్, నాస్కాం ప్రతినిధులను నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రపంచస్థాయిలో పోటీని తట్టుకునేలా, మారుతున్న టెక్నాలజీ రంగంలో విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్దేందుకు ఈ తరహా చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
జులై 15 నాటికి నివేదిక.. భవిష్యత్తు టెక్నాలజీ రంగానికి అవసరమయ్యే నైపుణ్యాలతో ప్రభుత్వ విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్ది వారికి హైఎండ్ టెక్నాలజీ రంగంలోని ఉన్నత ఉద్యోగాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపింది. దీనికోసం పాఠ్యప్రణాళిక, ఉండాల్సిన మానవ వనరులు, సదుపాయాలపై వచ్చే నెల జులై 15 కల్లా వర్కింగ్ గ్రూపు నివేదిక ఇవ్వనుంది.
నైపుణ్య శిక్షణ.. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్‌ఎల్‌ఎం), ఎల్‌ఎల్‌ఎం ఫ్లాట్‌ఫాం మీదకు వచ్చే డేటా అనలిటిక్స్ ఛాట్ జీపీటీ, వెబ్ 3.O, అగ్‌మెంటెడ్ రియాల్టీ, వర్చువల్ రియాల్టీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, అటానమస్ వెహికల్స్, త్రీడీ ప్రింటింగ్, గేమింగ్ సహా విద్యార్థులకు నైపుణ్యం ఇచ్చే అంశాలపై తీసుకోవాల్సిన చర్యలు, మార్పులను సూచించేందుకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
పాఠశాలల మోడల్ పై దృష్టి... విద్యాభ్యాసం తొలినాళ్ల నుంచే ఈ తరహా టెక్నాలజీపై బోధన, సంబంధిత నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక పాఠ్యాంశాలు, పాఠ్యప్రణాళిక, ఇవ్వాల్సిన శిక్షణ తదితర అంశాలపై ఈ వర్కింగ్ గ్రూపు ద్వారా ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. పాఠ్య ప్రణాళిక, మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, లెర్నింగ్ కంటెంట్, ల్యాబులు తదితర అంశాలు పాఠశాలల్లో ఎలా ఉండాలన్న దానిపై ఈ వర్కింగ్ గ్రూపు ఖరారు చేయనుంది. పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దీనికి చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
వర్కింగ్ గ్రూప్ కు ఛైర్మన్‌గా పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవహరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సెక్రటరీ సభ్యులుగా, పాఠశాలల మౌలిక సదుపాయాల కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. కమిటీ సభ్యులుగా స్కూలు ఎడ్యుకేషన్ కమిషనర్, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్, ఎస్‌ఈఆర్‌టీ డైరెక్టర్, మైక్రో సాఫ్ట్ ఇండియాకు చెందిన అశుతోష్ చద్దా, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియాకు చెందిన షాలినీ కపూర్, గూగుల్‌కు చెందిన ప్రతినిధి, ఇంటెల్ ఏసియా తరఫున షాలినీ కపూర్, నాస్కాం ప్రతినిధి, సెంటర్ ఫర్ డిజిటల్ ఎకానమీ పాలసీ రీసెర్చ్ అధ్యక్షుడు జైజిత్ భట్టాచార్యతో పాటు , నీతి అయోగ్ డిజిటల్ కమ్యూనికేషన్స్ మాజీ సలహాదారు అర్చనా. జి.గులాటి వర్కింగ్ ఉన్నారు. ఈ వర్కింగ్ గ్రూపు మరో నెల రోజుల్లో.. అంటే జూలై 15 నాటికల్లా ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.