దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ మొదటిరోజు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా, రెండవ రోజు శ్రీ బాలా త్రిపురసుందరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. మూడోరోజు అంటే ఈ రోజు శ్రీ గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిస్తోంది.
శ్రీ గాయత్రి దేవి విశిష్టత...
సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ దేవి అమ్మవారే. సకల మంత్రాలకు మూలశక్తి అయిన గాయత్రీ దేవి రూపంలో అమ్మను ఆరాధిస్తే అనంత మంత్రశక్తి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయని వేదాలు చెబుతున్నాయి. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం, చక్ర, గద, అంకుశం ధరించి అమ్మ గాయత్రి దేవిగా దర్శనమిస్తుంది.
మూడోరోజు నైవేద్యం...
దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో రూపం ఉన్నట్లే... నైవేద్యం కూడా ప్రతీరోజు ప్రత్యేకంగా ఉంటుంది. అమ్మవారికి మూడో రోజు అంటే.. ఆశ్వయుజ తదియ అమ్మవారికి బియ్యం, బెల్లం, నెయ్యి కలిపి సిద్ధం చేసిన అప్పాలను నివేదించాలి. ఇలా చేస్తే అమ్మవారు కటాక్షిస్తుందని భక్తుల నమ్మకం.