AP Govt on Tirumala Dams : తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. కరవు పరిస్థితులు నెలకొన్నప్పుడు భక్తుల అవసరాలకు సరిపడా నీరు అందించడం సమస్యగా మారుతోంది. ఈ క్రమంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో ఉన్న జలాశయాలను జలవనరుల శాఖ పరిధిలోకి తేవడంతో పాటు నిల్వ సామర్థ్యం పెంచేందుకు కసరత్తు చేస్తోంది.
Water Facilities in Tirumala : జలవనరుల శాఖ అధికారులు తిరుమలలోని జలాశయాలను పరిశీలించింది. వాటి తాజా స్థితిగతులు, భద్రతపై నివేదికను సిద్ధం చేశారు. జలాశయాల నిర్వహణకు తిరుమలలో రెండు సబ్ డివిజన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటికే కేంద్ర జలసంఘానికి చెందిన డ్యాం భద్రతా విభాగం జలాశయాలను సందర్శించి భద్రతపై నివేదిక సమర్పించింది.
తిరుమల శ్రీనివాసుని దర్శనం కోసం ప్రస్తుతం రోజూ సగటున లక్ష మంది భక్తులు వస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య లక్షా పాతికవేలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో తిరుమలలో ఇప్పుడున్న 5 జలాశయాల నీటి నిల్వలు భక్తుల అవసరాలు తీర్చడం సమస్యగా మారుతుందని భావిస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నీటి అవసరాలు తీర్చేందుకూ వీలుగా జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి ప్రణాళికలు రూపొందించారు.
"పసుపుధార, కుమారధార, పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం జలాశయాలను పరిశీలించాం. వాటికి ఏయే మరమ్మతులు చేయాలో కసరత్తులు చేస్తున్నాం. నీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి ప్రణాళికలు రూపొందించాం. టీటీడీ అధికారులకు నివేదిక సమర్పిస్తాం. కుమారధారలో నీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి అవకాశం ఉంది. అక్కడ 2 మీటర్ల తేడా ఉంది. అక్కడ గేట్లు ఏర్పాటు చేస్తే నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది." - మల్లిఖార్జునరెడ్డి, జలవనరులశాఖ సీఈ
పర్యావరణ ఇబ్బందులు లేకుండా పసుపుధార, కుమారధార జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి అవకాశం ఉండటంతో ఆ వైపుగా చర్యలు చేపట్టనున్నారు. పసుపుధార జలాశయానికి గేట్లు అమర్చడం ద్వారా నీటి నిల్వలను పెంచనున్నారు. తిరుమలలోని జలాశయాల్లో పూర్తి నిల్వ సామర్థ్యానికి, గరిష్ఠంగా నీటిని నిల్వ చేసే సామర్థ్యానికి మధ్య 2 మీటర్ల తేడా ఉంది. మరో మీటరు ఎత్తు ద్వారా అదనంగా 0.25 టీఎంసీలను నిల్వ చేసే వీలున్నట్లు అధికారులు చెబుతున్నారు.
తిరుమల కొండల్లో "పాలధారలు'' - మైమరచిపోతున్న భక్తులు
తిరుమల భక్తులకు గుడ్న్యూస్ - కావాల్సినన్ని లడ్డూలు - ఎప్పటినుంచో తెలుసా?