Chettinad Chutney Recipe in Telugu : ఉదయం టిఫిన్లలో ఎక్కువగా వినిపించే పేర్లు ఇడ్లీ, దోసె. వీటిల్లోకి పల్లీ, పుట్నాల చట్నీ ఎక్కువగా వాడుతుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో చిట్ల పొడులు నంజుకుని తింటుంటారు. నైజాం, రాయలసీమ, కోస్తా, కోనసీమ ప్రాంతాల్లో రుచులు వేర్వేరుగా ఉంటుంటాయి. అలాగే తమిళనాడులోని చెట్టినాడ్ ప్రాంతం రుచులకు పెట్టింది పేరు. చెట్టినాడ్ వంటకాల రుచుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కళ్లు మూసుకొని ఆరగించేంత రుచిగా ఉంటాయి. చెట్టినాడ్ వంటకాల రుచి, ప్రత్యేకత దేశవ్యాప్తంగా చెట్టినాడ్ రుచులుగా ప్రసిద్ధి చెందాయి.
ఇడ్లీ, దోసెల్లోకి ఎప్పుడూ ఒకే రకమైన చట్నీకి బదులు చెట్టినాడ్ స్టైల్ చట్నీని చాలామంది ఇష్టపడతారు. వాటిలోనూ ఎక్కువ ఆదరణ పొందింది టొమాటో పుదీనా చట్నీ. ఉల్లిపాయ, వెల్లుల్లి, కొబ్బరి వంటివి ఏమీ అవసరం లేకుండానే చెట్టినాడ్ స్టైల్ టమాటో పుదీనా చట్నీ తయారు చేసుకోవచ్చు. టమోటో పుదీనా చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందామా!
ఫుడ్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా? - రూ.10 లక్షల రాయితీకి దరఖాస్తు చేసుకోండి
చెట్టినాడ్ స్టైల్ టమాటో పుదీనా చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాల జాబితా
- టమోటా తరుగు 1 కప్పు
- పుదీనా ఆకులు 1/4 కప్పు
- కొత్తిమీర 1/4 కప్పు
- జీలకర్ర 1 టేబుల్ స్పూన్
- ఎర్ర మిరపకాయలు 5
- నూనె 2టేబుల్ స్పూన్లు (వేయించడానికి, మసాలా కోసం)
- ఆవాలు 1/2 టేబుల్ స్పూన్
- కరివేపాకు, తగినంత ఉప్పు
చెట్టినాడ్ చట్నీ తయారీ విధానం ఇలా
- ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో జీలకర్ర వేసి అది చిమ్మినప్పుడు ఎండు మిరపకాయలు వేసి కొన్ని నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర తరుగు వేసి కొద్దిగా వేయించుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు టొమాటో తరుగు వేసి అవి మెత్తబడే వరకు వేయించాలి.
- టొమాటోలు బాగా ఉడికిన తర్వాత పూర్తిగా చల్లారబెట్టుకుని ఆ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- మిక్సీలో పేస్ట్‌లా చేయకుండా కచ్చా పచ్చాగా ఉండేలా చూసుకోవాలి. పుదీనా, కొత్తిమీర ఆకులు కొద్దిగా కనిపించేలా ఉంటేనే రుచికి బాగుంటుంది.
- మిక్సీ పట్టిన చట్నీని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుని మసాలా సిద్ధం చేసుకోవాలి.
- చట్నీకి అవసరమైన మసాలా కోసం పాన్ లో 1 స్పూన్ నూనె పోసి వేడయ్యాక ఆవాలు, తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. అవి చిటపటలాడుతుంటే చట్నీ అందులో పోయాలి. అంతే!
చెట్టినాడ్ స్టైల్ టమోటో పుదీనా చట్నీ ఇడ్లీ, దోసెల్లోకి అద్భుతంగా ఉంటుంది.
"వావ్! టమాటా పులావ్" - ఇలా చేస్తే మెతుకు మిగల్చరంతే!
ఇండక్షన్ స్టవ్‌పై వంట చేస్తున్నారా ? మీరు డేంజర్లో ఉన్నట్టే!