WILD ANIMALS NEAR POLAVARAM PROJECT: ఏలూరు జిల్లాలో వన్య ప్రాణుల సంచారం భారీగా పెరిగింది. ఒకప్పుడు ఆ గ్రామాలు పోలవరం నిర్వాసితులతో ఉండేవి. అయితే ప్రస్తుతం వారంతా ఖాళీ చేయడంతో వన్య ప్రాణులు సందడి చేస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాపికొండల అభయారణ్యం పరిధిలోని 19 గ్రామాలను నిర్వాసితులు 2020 సంవత్సరం నాటికి ఖాళీ చేశారు. వారంతా అక్కడ నుంచి పునరావాస కాలనీలకు వెళ్లిపోయారు. దీంతో ఖాళీగా ఉన్న గ్రామాలు, వ్యవసాయ భూముల్లో పశుగ్రాసం విపరీతంగా పెరిగింది.
పక్కనే గోదావరి ఉండటంతో వన్య ప్రాణుల సంచారం సైతం భారీగా పెరిగింది. కొండ గొర్రెలు, నెమళ్లు, గొర్ర గేదెల సంఖ్య భారీగా పెరిగిందని, పలు వన్య ప్రాణులు పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు ఫారెస్ట్ రేంజర్ ఎస్కే వలీ తెలిపారు. అటవీ సిబ్బంది 15 రోజులకి ఒకసారి ట్రాప్ కెమెరాల చిప్‌లను మారుస్తారని, వాటిని పరిశీలించి అధికారులకు నివేదిస్తామని చెప్పారు.
ఆ రెండు గంటల సమయంలో చిరుత సంచారం: ఏలూరు జిల్లా పోలవరం మండలం కొరుటూరు వద్ద అటవీ శాఖ నిర్మించిన కాటేజీల సమీపంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు రేంజర్ ఎస్కే వలీ తెలిపారు. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాలో రికార్డ్ అయినట్లు చెప్పారు. జనవరి, ఫిబ్రవరి నెలల డేటా పరిశీలించగా ముఖ్యంగా రెండు గంటల వ్యవధిలో ఎక్కువగా చిరుత సంచారం ఉన్నట్లు తెలిపారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్య చిరుత సంచరించినట్లు తేలిందని అన్నారు. పక్కనే గోదావరి ఉండటంతో నీటి కోసం చిరుత వచ్చినట్లు భావిస్తున్నామన్నారు.
పర్యాటకుల భద్రత కోసం: పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే కాటేజీల చుట్టూ చైన్ లింక్ ఇనుప కంచె నిర్మించామని చెప్పారు. అదే విధంగా దానికి ఇరువైపులా గేట్లు సైతం అమర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వలీ పేర్కొన్నారు. పర్యాటకులు సాయంత్రం 6 గంటలు దాటాక కాటేజీల నుంచి బయటకు రావొద్దని హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
విశాఖ నుంచి కాకినాడ వరకు లగ్జరీ నౌక - ఏసీ రూమ్‌లు దీని ప్రత్యేకం
తెల్లవారుజామున 'గుడిస'కు పర్యాటకులు క్యూ - మర్చిపోలేని జ్ఞాపకాలు అందిస్తున్న హిల్‌స్టేషన్