ముంపులో లంక గ్రామాలు
ముంపుతో లంకగ్రామాల ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. అవసరమైన వస్తువులు, పశువులను పడవల్లో తరలించేందుకు వేలు ఖర్చుచేయాల్సి వస్తుందని వాపోతున్నారు. పెనుమూడి నుంచి ఒక్కో పడవకు 15 వేల రూపాయలు ఖర్చుచేసి సురక్షితప్రాంతానికి వచ్చామని గ్రామస్థులు అంటున్నారు. ఒక్కో గేదెకు రూ.900, మేకకు రూ.90, మనిషికి రూ.200లు ఛార్జీ చెల్లించాల్సి వచ్చింటున్నారు. రాయలంకలో ఉన్న పసుపు, కంద, అరటి తోటలు పూర్తిగా నీటమునిగాయి. పులిగడ్డ అక్విడెక్ట్ వద్ద వరద నీరు 18 అడుగుల మేర ప్రవహిస్తుంది.
పడవల్లో సురక్షిత ప్రాంతాలకు
మోపిదేవి మండలం, కొక్కిలిగడ్డ శివారు హరిజనవాడలో వరద నీరు చేరడం వలన కృష్ణా కరకట్టపై గుడిసెలు వేసుకున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బొబ్బర్లంక హరిజనవాడలో వరదనీరు రాకతో నివాసాలు నీట మునిగాయి. అవనిగడ్డ మండలంలోని పులిగడ్డ, పల్లెపాలెం, రేగుల్లంక గ్రామాలలోకి వరదనీరు చేరి.. సుమారు 200 నివాస గృహాలలోకి వరద నీరు చేరింది. ఎడ్లలంక గ్రామం వరద ఒరవడికి గట్టు కోతకు గురై కృష్ణానదిలో కలిసిపోతుంది. గ్రామం చుట్టూ వరద నీరు చేరడం వలన, ప్రజలు పడవల్లో వేరే ప్రాంతాలకు తరిలిపోతున్నారు.
కట్ట తెగితే గల్లంతే
కోడూరు మండలం ఉల్లిపాలెం వద్ద కృష్ణానది కరకట్ట భారీగా కోతకు గురైంది. ఈ ప్రాంతంలో కరకట్ట తెగిపోతే దీవిసీమంతా జలమయం అవుతుంది. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కృష్ణానది కరకట్టపై ఉన్న సుమారు 8 వేల ఎకరాలలో పంటలు పూర్తిగా నీటమునిగాయి. కంద, పసుపు, చెరకు, బొప్పాయి, అరటి, జామ, మునగ, క్యాబేజీ, మిరప, చిక్కుడు, మినుము, పట్టు పురుగులు, వరి పంట వరద నీటిలో మునిగిపోవడం వలన రైతులు తీవ్రనష్టం వాటిల్లింది. గత వరదకు నష్టపోయిన పంటలకు ఇప్పటికీ పరిహారం అందలేదన్న రైతులు.. అప్పుచేసి వేసి పంటలను ఇప్పుడు మళ్లీ వరద పూర్తిగా ముంచేసిందని ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి :