నల్ల మచ్చ తెగులుతో మిర్చి పంట ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదంటూ.. కృష్ణాజిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటపై సరైన అవగాహన కల్పించే అధికారులు లేక నష్టాలు చవిచూడాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు.
జిల్లాలో మిర్చిని అత్యధికంగా జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో సుమారు 30 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గత ఏడాది మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది రైతులు మిర్చి పంట సాగు విస్తీర్ణాన్ని పెంచారు. మిరప పంట చేతికి వచ్చే తరుణంలో కాయపై ఏర్పడుతున్న నల్ల మచ్చతెగులు రైతులను కలవరపెడుతుంది. ఇప్పటికే ఈ సీజన్లో వరుసగా కురిసిన అకాల వర్షాలు మిర్చి పంట తీవ్రంగా దెబ్బతీశాయి. మొదట్లో మొక్కలు చనిపోవడం, ఆ తర్వాత జెమిని వైరస్ విజృంభణ.. నిర్విరామంగా కురిసిన వర్షాల వల్ల అధిక తేమతో వేరు కుళ్ళుడు వంటి సమస్యలను రైతులు ఎదుర్కొని ఈ ఏడాది పంటను సాగు చేశారు. దీనివల్ల గతంకంటే పెట్టుబడులు 20 శాతం తిరిగాయని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం పలు మండలాల్లో మిర్చి కోతలు మొదలయ్యాయి.
- తక్కువ గ్రేడింగ్కే అమ్ముతున్న రైతన్న..
కోసిన కాయలపై నల్ల మచ్చలు ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పండు కాయపై ఉన్న మచ్చ.. కాయ కళ్ళంలో ఎండే కొద్ది మచ్చలు పరిమాణం పెరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ విధంగా ఉంటే గ్రేడింగ్లో సగం మేర తాలు రూపంలో తీసేయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు పొలంలో కాయంత ఒక్కసారే కోస్తున్నారు. ఎటువంటి గ్రేడింగ్ చేయకుండా అతి తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. పంట సాగు మొదలైన నాటి నుంచి మూడు నెలలపాటు నిర్విరామంగా కురిసిన వర్షాల వల్ల ఈ విధమైన మచ్చ తెగులు వ్యాపిస్తుందని రైతులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: