Fraud In the Name Of Clothes Factory in Anantapur District : దుస్తుల పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగస్వాములను చేసి ఉన్నత స్థానానికి తీసుకెళ్తామంటూ ఓ మోసగాడు వల పన్ని ఒకరిని కాదు, ఇద్దరిని కాదు ఏకంగా వంద మందిని బురిడీ కొట్టించాడు. మాయమాటలు చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసి పత్తా లేకుండా పోయాడు. ఈ భాగోతం సత్యసాయి జిల్లా తాడిమర్రి, బత్తలపల్లిలో వెలుగులోకి వచ్చింది. మడకశిరకు చెందిన ఓ వ్యక్తి తాడిమర్రి మండలంలోని పట్రపల్లి గ్రామం వద్ద దుస్తుల పరిశ్రమ ఏర్పాటు చేస్తానని, పనులు చేసేందుకు ట్రాక్టర్లు కావాలని పలువురిని సంప్రదించాడు.
ప్రతి నెలా ట్రాక్టరుకు రూ.40,000 చొప్పున అద్దె చెల్లిస్తానని సుమారు వంద మందితో ఒప్పందం కుదర్చుకున్నాడు. కొన్ని రోజుల తరువాత పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే రూ.12,500 అడ్వాన్స్‌గా చెల్లించాలని ట్రాక్టరు యజమానులకు సూచించాడు. అతన్ని నమ్మి పలువురు ఆన్‌లైన్ ద్వారా డబ్బు పంపించారు. రోజులు గడుస్తున్నా ఎటువంటి స్పందన లేకపోవడంతో బాధితులు అతనికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది.
ఒక్కొక్కరి నుంచి రూ.లక్షకు పైగానే : మోసగాడి వలలో చిక్కుకున్న బాధితులు తాడిమర్రి, బత్తలపల్లి మండలాల్లో వందకు పైగా ఉన్నట్లు సమాచారం. కొందరితో సన్నిహితంగా ఉండి వారి నుంచి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల దాకా వసూలు చేశాడు. తాడిమర్రి మండలంలోని భరత్, సంజీవరెడ్డి నుంచి చెరో రూ.లక్ష, బత్తలపల్లికి చెందిన రమేశ్ నుంచి రూ.రెండు లక్షలు దాకా వసూలు చేశాడు. ఫోన్‌పేలో తన చరవాణి నంబరుకు నగదు బదిలీ చేస్తే సమస్యలు వస్తాయని సదరు వ్యక్తి తనకు తెలిసిన వారి చరవాణి నంబరుకు పంపించేలా చేసుకున్నాడు. కొంతమంది తాము మోసపోయామని తెలిసి బయటకు చెప్పుకొంటే అవమానకరంగా ఉంటుందని భావించి మరికొందరు మౌనం వహిస్తున్నారు. పోలీసులు విచారణ చేస్తే బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఒప్పందం చేసుకుని : అందరికీ నమ్మకం కల్గించేందుకు పట్రపల్లిలో 25 ఎకరాలు, ఎకరా రూ.2.20 లక్షల చొప్పున కొనుగోలు చేస్తానని అగ్రిమెంట్ చేసుకుని, 22 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున అతను అడ్వాన్స్ ఇచ్చాడు. బత్తలపల్లి మండలంలోని అప్రాచెరువులో రూ.22 లక్షలతో 13 ఎకరాలు, ధర్మవరం సమీపాన కాకతీయ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వద్ద 29 ఎకరాలు కొనుగోలు చేస్తానని భూ యజమానులతో ఒప్పందం చేసుకుని ఎకరాకు రూ.10 వేలు చొప్పున అడ్వాన్స్ ఇచ్చాడు. ట్రాక్టర్ల యజమానులకు, సన్నిహితంగా ఉండే వారందికీ ఈ విషయాలు చెప్పి నమ్మించాడు. పెనుకొండలో ఇదే తరహాలో రూ.2.50 కోట్లు మోసానికి పాల్పడటంతో 2021లో కియా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైనట్లు తెలిసింది.
పరిశ్రమ ఏర్పాటైతే బాగుపడతామనే ఉద్దేశంతో ఏమీ ఆలోచించకుండా అడిగిన వెంటనే మోసగాడు చెప్పిన ఫోన్‌పే నంబరుకు డబ్బులు పంపించామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అతని నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో మోసపోయామని గ్రహించామని, బాధిత రైతులంతా పోలీసులే మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
బాధితులను విచారించి తగిన చర్యలు తీసుకుంటామని ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్ తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, రుణాలు ఇప్పిస్తామని, అద్దెలు ఎక్కువ చెల్లిస్తామంటూ కొందరు మోసం చేస్తుంటారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు, ఇతరత్రా మార్గాల ద్వారా నిర్ధారణ చేసుకున్న తరువాతే ముందుకెళ్లాలని తెలిపారు.