క్రికెట్‌లో సింగిల్ రన్ తీయడం చేతకాని వ్యక్తి సెంచరీ కొడతానని ప్రగల్భాలు పలికినట్లుగా వైకాపా ప్రభుత్వ వైఖరి ఉందని రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ఎద్దేవా చేశారు. వైకాపా నేతలకు పాలన చేతకాకపోతే ఇంట్లో కూర్చొని వీడియో గేమ్‌లు ఆడుకోవాలే తప్ప అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని నాశనం చెయ్యొద్దని హితవు పలికారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
"అనంతపురంలో వార్డు సచివాలయ భవనాలకు ప్రభుత్వం అద్దెకట్టలేదని యజమానులు తాళాలు వేసి ఉద్యోగులను రోడ్డు మీదకు నెడుతున్నారు. భవనాలకు అద్దెకట్టడటం చేతకాని వైకాపా ప్రభుత్వం మూడు రాజధానులు కడుతుందా?ముఖ్యమంత్రి జగన్‌కి బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి ఇలా మూడు చోట్ల మూడు ఇళ్లు ఉన్నాయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారా? లేక, వైకాపా జెండాకు మూడు రంగులు ఉన్నాయి కాబట్టి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారా?" అని వైకాపా ప్రభుత్వాన్ని అనగాని ప్రశ్నించారు.
ప్రభుత్వం తీసుకునే అనాలోచిత, అజ్ఞానపు నిర్ణయాలను న్యాయస్థానాలు అడ్డుకోకపోతే ఆ పార్టీ నేతలు ఈ పాటికి రాష్ట్రాన్ని నిలువునా ముంచేసే వారని అనగాని విమర్శించారు. ఆడబిడ్డలు కన్నీరు పెడితే ఇంటికి, అన్నదాతలు కంటతడి పెడితే దేశానికి మంచిది కాదంటారన్న అనగాని.. వైకాపా పాలనలో వారంతా ప్రతి రోజూ ఏడుస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు కోట్ల మంది భవిష్యత్తు బాగు కోసం భూమిలిచ్చిన రైతులు, మహిళలు నెలల తరబడి ఉద్యమం చేస్తున్నా ముఖ్యమంత్రి కనీసం స్పందించకపోవటం బాధాకరమన్నారు. వైకాపా నేతలు అమరావతిపై దుష్ప్రచారం చేయడానికే ఏడాదిన్నర కాలం వృథా చేశారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో మిగిలిన మూడు సంవత్సరాల సమయం వృథా చేయడం తప్ప మూడు ఇటుకలు కూడా పేర్చలేరని ప్రజలకు తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకుని రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టాలని అనగాని సత్యప్రసాద్ హితవు పలికారు.
ఇదీ చదవండి: కాలం చెల్లిన సరకు అమ్మకాలపై ఎక్సైజ్‌శాఖ నిర్వాకం