కోనసీమ జిల్లా పి.గన్నవరం మాజీ శాసనసభ్యుడు పులపర్తి నారాయణమూర్తి.. చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరాలనుకుని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. తెదేపా కండువా తీసుకెళ్లి తన మెడలో వేయాలని అభ్యర్థించగా.. చంద్రబాబు సున్నితంగా తిరస్కరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు.. అన్నవరంలో నేడు ప్రత్తిపాడు తుని అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో బొడ్డు వెంకటరమణను ఆయన పార్టీలో చేర్చుకున్నారు. నారాయణమూర్తి ఆశ మాత్రం ఆడియాసగానే మిగిలిపోయింది.
నారాయణమూర్తి 1996 ఉప ఎన్నికలలో నగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తిరిగి 2014లో పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే.. 2019లో ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో.. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి.. తిరిగి సొంతగూటికి చేరే పయత్నం చేయగా.. అధిష్టానం సుముఖత చూపటం లేదు. స్థానిక క్యాడర్లోనూ నారాయణమూర్తి పట్ల వ్యతిరేకత ఉంది.
ఇదీ చదవండి: రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు.. మరో ప్రజాఉద్యమం : చంద్రబాబు