CROP DAMAGE: గోదావరికి వరద.. లంక గ్రామాల రైతులను కష్టాల్లో కూరుకుపోయేలా చేసింది. అరటి, కంద, బొప్పాయి, మిర్చి, కూరగాయలు, తమలపాకులు, పూలతోటలు సహా.. ఉద్యానవన పంటలకు నెలవైన కోనసీమ లంకల్లో ఇప్పుడు ఎటు చూసినా.. మునిగిన పొలాలే దర్శనమిస్తున్నాయి. గౌతమీ గోదావరి తీరంలోని తీరంలోని ఆలమూరు, కపిళేశ్వరపురం, అయినవిల్లి, ముమ్మిడివరం, కె.గంగవరం, తాళ్లరేవు, ఐ.పోలవరం మండలాల్లోని గోదారి తీరం వరదలకు విలవిలలాడుతోంది. వరద ఉద్ధృతి తగ్గుతుండటంతో.. మునిగిన పంటలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వేల ఎకరాల్లో చేతికొచ్చిన అరటి పూర్తిగా తుడుచుపెట్టుకు పోయింది. మిగతా ఏ పంటలు కూడా పనికి రాకుండా పోయాయి. ఎకరానికి 50వేల కౌలు, లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేస్తే ప్రతి ఏటా తమకు కన్నీరే మిగులుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
వైనతేయ, వశిష్ఠ గోదావరి తీరంలోని పి.గన్నవరం, మామిడికుదురు, రాజోలు, మల్కిపురం, సఖినేటిపల్లి, అల్లవరం తీరంలోని లంక గ్రామాలదీ ఇదే దుస్థితి. జులై నెలలో పంటలు పూర్తయ్యేలా వివిధ పంటలు సాగు చేస్తే.. చివరకు తమకు వరద గోదావరి అంతులేని నష్టాన్ని మిగిల్చిందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం.. పరిశీలించి వెళ్లడం తప్ప తమకు ఒక్కరూపాయి కూడా సాయం అందడం లేదని అంటున్నారు. కొందరు రైతులు వరదలోనే కొంత మేర అరటి గెలలు, బొప్పాయి కాయల్ని కోసుకొస్తున్నారు. కనీసం రవాణా ఖర్చులైనా వస్తాయన్న ఆశతో వరదలోనే ప్రాణాలకు తెగించి పంట ఉత్పత్తుల్ని ఒడ్డుకు చేర్చుతున్నారు.
ఇవీ చదవండి: