Temperatures in AP: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు సెగలు కక్కుతున్నాడు. వాయవ్య భారత్ నుంచి వీస్తున్న ఉష్ణగాలుల ప్రభావానికి రాష్ట్రంలో మరోమారు తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇంటి నుంచి బయటకు రావట్లేదు. ఒకవేళ బయటకు వచ్చినా.. గొడుగు వెంట బెట్టుకుని వస్తున్నారు. లేకుంటే స్కార్ఫ్, టవల్ వంటి వాటిని ఎండ వేడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు వినియోగిస్తున్నారు.
మరో మూడు రోజుల పాటు హీట్ వేవ్ పరిస్థితులు.. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మరో మూడు రోజుల పాటు హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ఈ నెల 18వ తేదీ వరకూ రాష్ట్రంలో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నట్టు అమరావతి వాతవరణ కేంద్రం తెలిపింది. ప్రత్యేకించి ఉత్తర, కోస్తాంధ్ర జిల్లాల్లో తీవ్ర ఉక్కపోత, వేడిమి పరిస్థితులు కొనసాగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.. నాలుగు రోజుల క్రితమే నైరుతీ రుతుపవనాలు రాష్ట్రంలోని శ్రీ హరి కోట వరకూ విస్తరించినా పశ్చిమ తీరంలోని బిపర్ జోయ్ తుపాను కారణంగా ముందుకు కదలకపోవటంతో ప్రస్తుతం రాష్ట్రంలో వేడిమి పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ఇక రాష్ట్రంలో అత్యధికంగా తాడేపల్లిగూడెం, శ్రీకాకుళం జిల్లా పొందూరులలో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ప్రకాశం జిల్లా జరుగుమిల్లిలో 44.5 డిగ్రీల సెల్సియస్, విజయనగరం జిల్లా నెల్లిమర్ల, నెల్లూరు జిల్లాల్లో 44 డిగ్రీలు, కృష్ణా, విజయనగరం, ఏలూరు, తిరుపతి, ఎన్టీఆర్ జిల్లాల్లో 43 డిగ్రీలు రికార్డు అయ్యింది. కాకినాడ, తూర్పుగోదావరి, బాపట్ల, పల్నాడు, అల్లూరి సీతారామ రాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, గుంటూరు, అనకాపల్లి, నంద్యాల, తూర్పుగోదావరి జిల్లాల్లో 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు అయ్యింది. మరో 3 రోజుల పాటు తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే సూచనలు ఉన్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది.
వర్షాలు కురిసే సూచనలు.. ఈ నెల 18, 19 తేదీన రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశముందని ఐఎండీ అంచనా వేస్తోంది. మరోవైపు రాగల నాలుగైదు రోజుల్లో కోస్తాంధ్ర జిల్లాల్లోనూ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వెల్లడించింది. రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. ఉత్తర, కోస్తాంధ్ర జిల్లాల్లో కొన్ని చోట్ల ఉష్ణగాలుల ప్రభావంతో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలియజేసింది.