Temples crowded in AP: కార్తిక మాసంలో ముగుస్తున్న సమయంలో శివనామ స్మరణతో ఆలయాల్లో శోభ సంతరించుకుంది. శివాలయాలకు భక్తులు పోటెత్తడంతో ఆలయాల్లో అంతా పండగవాతావరణం నెలకొంది. మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆలయాల్లో దీపాలను వెలిగించారు. కార్తిక మసం ముగుస్తుండటంతో భక్తులు ఆలయాలకు క్యూ కట్టారని అధికారులు తెలిపారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి: పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తిక మాసం చివరి దశకు చేరుకున్న వేళ.. ఆలయాలకు భక్తులు తరలివచ్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మంగళవారం దుర్గామల్లేశ్వర స్వామికి ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో... లక్ష బిల్వార్చన పూజ ఘనంగా జరిగింది. స్వామివారిని దర్శించుకొని భక్తులు తరించారు.
బాపట్ల జిల్లా: మార్టూరు మండలం ద్రోణాదులలో అంకమ్మ శక్తి క్షేత్రంలో లక్ష దీపోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు ధన్వంతరి పూజ, రుద్ర హోమం చేశారు. దీపాలు వెలిగించిన మహిళలు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా: నరసాపురం మండలం కొప్పర్రు శివాలయంలో సహస్ర దీపాలంకరణ జరిగింది. జనసేన ఆధ్వర్యంలో వీర మహిళలు, నాయకులు.. పార్టీ గుర్తు ఆకారంలో దీపాలు పెట్టారు. ప్రత్యేక పూజలు చేశారు. విశాఖ జిల్లా పద్మనాభంలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలో... కొండమెట్ల దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రమిదలు వెలిగించిన భక్తులు.. ఆ తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో లక్ష దీపారాధన కన్నుల పండువగా జరిగింది.
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు జరిగాయి. స్వర్ణముఖి నదిలో భక్తులు కార్తిక దీపాలను వదిలారు. అనంతపురం జిల్లా తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో తెప్పోత్సవం నిర్వహించారు. పెన్నా నదిలో రామలింగేశ్వర స్వామి విహరించారు. గంగా హారతిని చూసేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
ఇవీ చదవండి: