TDP LEADERS COMPALINT TO CHIEF ELCTION OFFICER : ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలో జరుగుతున్న అక్రమాలపై తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనాను కలిసి ఓటర్ల జాబితా రూప కల్పనలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కనీసం డిగ్రీ కూడా లేని వారిని పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్లుగా నమోదు చేయటంపై టీడీపీ నేతలు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. పార్టీ నేతలు నక్కా ఆనంద్ బాబు, అశోక్ బాబు, తదితరులు ఎన్నికల ప్రధానాధికారిని కలిసి తగిన వివరాలు సమర్పించారు. డిగ్రీ లేకుండానే ఓటర్లుగా నమోదైన వారిపై చర్యలు తీసుకోవటంతో పాటు వారిని ఓటర్లుగా నమోదు చేసిన అధికారులపైనా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ప్రతాప్ రెడ్డిని కడప జిల్లా విద్యాశాఖ ఆర్జేడీ విధుల నుంచి తొలగించాలి: మరో వైపు కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కల్పనా రెడ్డి భర్త ప్రతాప్ రెడ్డిని కడప విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్(ఆర్జేడీ)గా నియమించడాన్ని ఆక్షేపిస్తూ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన అనంతరం టీడీపీ నేతలు నక్కా ఆనంద్ బాబు, అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులను ప్రలోభాలకు గురి చేసేందుకే ఎమ్మెల్సీ కల్పనా రెడ్డి భర్త ప్రతాప్ రెడ్డిని కడప జిల్లాలో విద్యాశాఖ ఆర్జేడీగా ప్రభుత్వం నియమించిందని ఆరోపించారు. ప్రతాప్ రెడ్డిని విద్యాశాఖలో ఆర్జేడీ విధుల నుంచి తొలగించాలని కోరినట్టు వివరించారు. తమ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్టు నేతలు స్పష్టం చేశారు. మరో వైపు తిరుపతిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనర్హులను ఓటర్లుగా నమోదు చేశారని.. దీనిపై గతంలోనూ ఫిర్యాదు చేసినట్టు వివరించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్: తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయ, పట్టభద్రులు, స్థానిక సంస్థల్లో ఖాళీ అవనున్న స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 9వ తేదీన షెడ్యూల్ విడుదల చేసింది. రేపు దీనికి సంబంధించి నోటీఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏపీలో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ, 8 స్థానిక సంస్థల స్థానాలతో కలిపి మొత్తం 13 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఇవీ చదవండి: