TDP Leader Pattabhi Ram on AP FiberNet Project: ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలు చేసిన ఖర్చును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన పట్టాభి.. వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా, భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తక్కువ ఖర్చుతో ఏపీలో ఫైబర్ నెట్ ప్రాజెక్టును అమలు చేయడమే జగన్ రెడ్డి, సీఐడీ దృష్టిలో చంద్రబాబు చేసిన నేరమా అని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వమే ఔరా అనేలా: దేశంలోని 15 పెద్ద రాష్ట్రాలకు సాధ్యంకాని విధంగా తక్కువ ఖర్చుతో ఫైబర్ నెట్ ప్రాజెక్టును సమర్థవంతంగా అమలుచేయడమే చంద్రబాబు చేసిన పెద్ద తప్పా అంటూ నిలదీశారు. దేశంలోని అనేక రాష్ట్రాలు పెట్టిన ఖర్చుకంటే చాలా తక్కువగా కేవలం 1/4 శాతం వ్యయంతోనే చంద్రబాబు ఏపీలో ఫైబర్ నెట్ ప్రాజెక్టును అమలుచేసి కేంద్ర ప్రభుత్వమే ఔరా అనేలా చేశారని గుర్తు చేశారు. టెలికమ్ లైసెన్సు సాధించిన మొట్టమొదటి రాష్ట్రంగా ఏపీకి చంద్రబాబు ఘనత సాధించి పెట్టారన్నారు.
TDP Leader Pattabhi on Fibernet Scam: ఫైబర్ నెట్ కుట్రపూరిత కేసులో మొదటి ముద్దాయి జగనే: పట్టాభి
తక్కువ ఖర్చుతో అధునాతన టెక్నాలజీ: ఫైబర్ నెట్ ప్రాజెక్టులో డబ్బును ఆదా చేసినందుకా చంద్రబాబుకు నిర్బంధించారని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన నేరమా? అని పట్టాభి ప్రశ్నించారు. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో భాగంగా మిగతా రాష్ట్రాలకంటే తక్కువ ఖర్చుతో అమలుచేయడమేగాక, అడ్వాన్స్డ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదని పట్టాభిరామ్ తెలిపారు.
వాస్తవాలపై వెబ్సైట్: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ట్రూత్ డాట్ కామ్ పేరుతో వెబ్సైట్ సైతం సిద్ధం చేసి.. అందులో స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన నిజాలను పెట్టామని అన్నారు. వందల కొద్దీ డాక్యుమెంట్లను విడుదల చేశామని తెలిపారు. అయినా సరే వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒకసారి కళ్లు తెరచి చూడాలని తెలిపారు. మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. వైసీపీ నేతలు ఏ రోజు రమ్మన్నా వస్తామని.. లేదంటే వారు టీడీపీ ఆఫీసుకు వచ్చినా ప్రతి అంశం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి చూపిస్తామని సవాల్ చేశారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తక్కువ ఖర్చుతో ఫైబర్ నెట్ పాజెక్టు పూర్తి చేశామని తెలిపారు. తద్వారా వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగిలాయని.. దానినే నేరంగా వైసీపీ నేతలు చెబుతున్నారని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా అతి తక్కువ ఖర్చుతో చేసి చూపించామని.. ఈ విషయం కేంద్ర సైతం తెలిపిందని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో పట్టాభి స్పష్టం చేశారు. ఫైబర్ నెట్ ప్రాజెక్టు ఫేజ్ 1లో 24 వేల కిలోమీటర్ల లైన్ వేయడం జరిగిందని పేర్కొన్నారు.