Sarpanches Agitation in Guntur: సర్పంచులను రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవ విగ్రహాలుగా మారుస్తోందని గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు పాపారావు అన్నారు. ఉమ్మడి జిల్లాల సర్పంచులు గుంటూరులో సమావేశమై అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. 15వ ఆర్థిక సంఘం నిధులను పీడీ ఖాతాలకు మళ్లించాలన్న ప్రభుత్వ ఆదేశాలను నిరసిస్తూ.. సంబంధిత ఉత్తర్వులను చింపేశారు. నిధులు లేకపోవటం వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని వాపోయారు.
గతంలో 14వ ఆర్థిక సంఘం నిధులు మాకు తెలియకుండానే తీసేసుకున్నారని.. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం నిధులు లాగేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇలా అయితే గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. నిధులు లేకపోవటం వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని.. ప్రజలకు మొహం చూపించుకోలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వెలిబుచ్చారు. ఇలాగైతే సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకున్నట్లే.. గ్రామాన్ని బాగు చేయాలని సర్పంచులు భావిస్తారని అన్నారు. నిధులు లేకపోవటంతో సర్పంచులు గ్రామాల్లో పారిశుద్థ్య పనులు చేయలేకపోతున్నారని తెలిపారు. సర్పంచుల ఆందోళనకు అఖిలభారత పంచాయతీ పరిషత్ మద్దతు తెలిపింది. గ్రామాలకు కేంద్రం ఇచ్చే నిధుల్ని కరెంటు బిల్లుల కోసం మళ్లించటం సరికాదని నేతలు అభిప్రాయపడ్డారు.
ఇవీచదవండి: