అమరావతి ఉద్యమంలో మహిళలపై జరిగిన దాడులు కలిచివేశాయని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడాన్ని పవన్ తప్పుబట్టారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతి రైతులు చేసిన త్యాగాన్ని అవహేళన చేయడం సరికాదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా ఒప్పుకున్న జగన్ మోహన్ రెడ్డి...ఇప్పుడు మాట మార్చారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తురాని కులం...ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు.
రైతు కన్నీరు పెడితే పాలకులకు మంచిది కాదని పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతికి గతంలో మద్దతు తెలిపిన వైకాపా ఇప్పుడు మాట మార్చిందన్నారు. ఒకచోట ఓ మాట చెప్పి, మరోచోట మాట మార్చే వ్యక్తిని కాదన్న పవన్... ఒకే రాజధాని ఉండాలనే మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. అమరావతి ఆడపడుచులే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. అమరావతి ఉద్యమానికి జనసేన మద్దతుగా ఉంటుందన్నారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని బలంగా నమ్ముతున్నామన్నారు.
పోలీసులు బలహీనుల పక్షాన నిలబడాలన్న పవన్... పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా పని చేయాలని సూచించారు. రాజధాని రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేసే హక్కు ప్రజలకు ఉంటుందన్నారు. అమరావతిలో రాజధానిని కొనసాగించాలని భాజపాతో పొత్తు పెట్టుకున్నప్పుడే రిజల్యూషన్ పెట్టామన్నారు. అమరావతిపై భాజపా కూడా స్పష్టంగా ఉందన్న ఆయన...కొందరి వ్యాఖ్యలు అయోమయ పరిస్థితులకు దారి తీస్తున్నాయన్నారు. అమరావతి ఉద్యమానికి జనసేన అండగా ఉంటుందని పవన్ మరోమారు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : తెలంగాణ: జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో జనసేన