గిరిజన ఆవాసాలన్నింటికీ రహదారి సౌకర్యాలను కల్పించడానికి చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గిరిజన రోగులను డోలీలలో తీసుకురావాల్సిన దుస్థితి రాకుండా చూడాలని అన్నారు. అన్ని గిరిజన ప్రాంతాల్లో నియోజకవర్గానికి వంద పడకలతో గర్భిణీల కోసం వసతి గృహాలను నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారలను ఆదేశించారు. ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన గర్భిణీల హాస్టళ్లను మరింతగా విస్తరించాలని నిర్ణయించామన్నారు.
ప్రసవ సమయాల్లోనే ఇబ్బందులు ఎక్కువ:
రహదారులు, సమాచార వ్యవస్థ లేని ప్రాంతాల్లో నివసించే మహిళలు ప్రసవ సమయంలో ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అటవీ, గిరిశిఖర గ్రామీణ ప్రాంతాల్లో పనులు చేయడంలో సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి అభివృద్ధిని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గిరిజన శాఖలో మంజూరు చేసిన పనులు సకాలంలో పూర్తి కాకపోవటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒప్పందాలకు అనుగుణంగా కాంట్రాక్టర్లు పని చేయకపోతే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
సీనియర్లకు పదోన్నతలు:
సీనియార్టీ జాబితాలను సరిచేసి అర్హత కలిగిన వారందరికీ పదోన్నతులు ఇస్తామని తెలిపారు. పని చేయనివారి స్థానంలో కొత్త వారిని తీసుకొస్తామని వివరించారు. అవసరమైతే ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్ మీద ఇంజనీర్లను తీసుకొస్తామని స్పష్టం చేశారు. విధులను నిర్లక్ష్యం చేసే వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని పేర్కొన్నారు.ప్రస్తుతం చేస్తున్న పనుల్లో నాణ్యతను పరిశీలించడానికి క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని పునర్ వ్యవస్థీకరిస్తామని మంత్రి పుష్ప శ్రీవాణి ప్రకటించారు.
ఇదీ చదవండి: మన్యంలో ప్రత్యేక బలగాల గాలింపు..!