Minister Vidadala Rajini Construct YSRCP Office : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల బదిలీల్లో భాగంగా చిలకలూరిపేట నుంచి మంత్రి విడుదల రజనీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆమె అక్కడి నుంచే పోటీలో నిలవనున్నారు. ఇటీవలే ఆమె నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలు సైతం చేపట్టారు. ఇకపై స్థానికంగానే నివాసం ఉంటూ నియోజకవర్గ ప్రజలు, నేతలతో సమన్వయం చేసుకునేందుకు గుంటూరులో కార్యాలయ నిర్మాణం చేపట్టారు. శ్యామలానగర్ 2వ వీధిలోని తమ స్థలంలోనే 20 రోజుల క్రితం శంకుస్థాపన చేసి నిర్మాణం ప్రారంభించారు. అయితే ఈ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవు.
YSRCP Office in Guntur Without Permission : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే నగరపాలక సంస్థ అనుమతి తప్పనిసరి. నిర్మాణానికి సంబంధించి ప్లాన్ అందజేసి దాని ప్రకారం ఫీజు చెల్లిస్తే అధికారులు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకుని అనుమతి మంజూరు చేస్తారు. కానీ మంత్రి కార్యాలయానికి సంబంధించి కనీసం ప్లాన్ అనుమతి కోసం దరఖాస్తు కూడా చేయలేదు. అక్కడ దాదాపు 400 గజాల స్థలంలో పార్టీ కార్యాలయ నిర్మాణం జరుగుతోంది.
నూతన సంవత్సర వేడుకల్లో మందుబాబుల విధ్వంసం - ఆ పార్టీ కార్యాలయంపై రాళ్ల దాడి!
అనుమతులు లేవని కూల్చివేత : ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాల ప్రకారం లక్షల్లోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కానీ పైసా కూడా చెల్లించకుండా మంత్రి రజనీ నిర్మాణాలు చేపట్టారు. గతంలో ఓ హోటల్ నిర్మాణం కోసం యాజమాన్యం దరఖాస్తు చేసుకోగా అనుమతులు రాకముందే పనులు ప్రారంభించారంటూ నగరపాలక సిబ్బంది కూల్చివేసింది. మరి ఇప్పుడు కనీసం అనుమతి కోసం దరఖాస్తు చేసుకోకుండానే నిర్మాణాలు చేపట్టినా అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఖాళీ స్థలంలో రజనీ జీవనం : మంత్రి రజనీ చిలకలూరిపేట నుంచి గుంటూరుకు ఓటు హక్కు బదిలీ చేసుకోవడం కూడా వివాదానికి దారితీసింది. శ్యామలానగర్‌లోని సాయి గ్రాండ్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నట్లు ఆమె ఓటుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఇంటి నెంబర్ ప్రకారం వెళ్లి చూస్తే అక్కడ ఖాళీ స్థలం ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. మంత్రి హోదాలో ఉండి తప్పుడు చిరునామాతో ఓటు పొందడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తప్పుడు చిరునామాతో ఓట్లు : పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులే ఈ విధంగా అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం, తప్పుడు చిరునామాతో ఓట్లు పొందడాన్ని ప్రజల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.