అమరావతిని రాజధానిగా కాపాడటంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన శాసనమండలి మాజీ ఛైర్మన్ మహ్మద్ షరీఫ్‌ను.... గుంటూరు జిల్లా తెలుగుదేశం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ సారథ్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం ముఖ్యనేతలు, రాజధాని ఐకాస నాయకులు, అమరావతి ప్రాంత రైతులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎమ్మెల్సీల పాత్ర అద్భుతం
ధర్మస్థానంలో కూర్చున్నప్పుడు ప్రజలకు న్యాయం చేయాలన్న అల్లా సూక్తిని పాటిస్తూ... మూడు రాజధానుల బిల్లును సెలక్ట్ కమిటీకి పంపానని షరీఫ్ అన్నారు. చంద్రబాబు చెప్పిన రాజకీయ పాఠాలు తనను నడిపించాయన్నారు. మండలి వేదికగా అమరావతిని కాపాడేందుకు చేసిన ప్రయత్నంలో తెలుగుదేశం ఎమ్మెల్సీల పాత్ర అద్భుతమన్నారు. ధర్మాన్ని కాపాడటానికి పోరాడితే కొంచెం ఆలస్యమైనా విజయం దక్కుతుందని... ఇప్పుడు హైకోర్టు తీర్పు రూపంలో ధర్మం గెలిచిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మళ్లీ కొత్త బిల్లు తెస్తామని చెప్పడం ఉత్త మాటేనన్నారు.
తెలుగు ప్రజలకు చిరకాలం గుర్తుంటుంది..
రాజధానిగా అమరావతిని కాపాడటంలో షరీఫ్ చూపిన ధైర్యం... తెలుగు ప్రజలకు చిరకాలం గుర్తుంటుందని తెలుగుదేశం నేతలు కొనియాడారు. అమరావతి రైతులు ఏం చేసినా ఆయన రుణం తీర్చుకోలేనిదని ఐకాస నాయకులు అన్నారు. ఆయన చొరవతో అమరావతిని, రాష్ట్రాన్ని రక్షించారని కీర్తించారు.ప్రజల హక్కుల్ని పరిరక్షించడంలో షరీఫ్ మైనార్టీలకు ఆదర్శప్రాయుడిగా నిలిచారని... కార్యక్రమాన్ని నిర్వహించిన తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ అన్నారు.
ఇదీ చదవండి : Lokesh News: తెదేపా అలా చేసి ఉంటే జగన్ అధికారంలోకే వచ్చేవారా ?: లోకేశ్