గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రోజు 400 టన్నుల చెత్త పోగవుతుంది. కొంత కాలం క్రితం తడిచెత్తను హోం కంపోస్టు, ఆన్ సైట్ కంపోస్టు యార్డుల ఏర్పాటు ద్వారా సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే పొడి చెత్తలో ఎక్కువగా వస్తోన్న ప్లాస్టిక్ విషయంలో నగరపాలక సంస్థ పూర్తిస్థాయిలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించటం లేదు.
డీజిల్, పెట్రోల్ తయారీ
ప్లాస్టిక్ వ్యర్థాలు రోజుకు 20 టన్నుల మేర వస్తున్నాయి. అందులో 500 కిలోలు మినహా మిగతా మొత్తాన్ని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. జీఎంసీ తరపున ప్లాస్టిక్ నుంచి ఇంధన తయారీ ప్లాంటు ఏర్పాటు చేశారు. అందులో నిత్యం 500 కిలోల ప్లాస్టిక్ ని వినియోగించి డీజిల్, పెట్రోలు తయారు చేస్తున్నారు. కొత్త సాంకేతికత కావటంతో ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు ప్రయోగాత్మకంగా తక్కువ సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేశారు.
15 టన్నుల ప్లాస్టిక్ ను ఇంధనంగా మారుస్తున్నారు...
ఇంధన తయారీ ప్లాంట్ ద్వారా నెలకు 15 టన్నుల ప్లాస్టిక్‌ను ఇంధనంగా మారుస్తున్నారు. ఇక్కడ తయారయ్యే డీజిల్‌ను కార్పొరేషన్ వాహనాలకు వినియోగిస్తున్నారు. తద్వారా నెలకు రూ.5లక్షల రూపాయల మేర ఇంధన బిల్లులు ఆదా అవుతున్నాయి. తక్కువ పరిమాణంలో పెట్రోలు, కిరోసిన్ కూడా ఉత్పత్తి అవుతోంది. అలాగే చివర్లో మిగిలిపోయే కార్బన్‌ను మొక్కలకు ఎరువుగా ఉపయోగిస్తున్నారు. ఇలా మొత్తంగా రూ. 5.5లక్షలు కార్పొరేషన్‌కు కలిసి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఇలాంటి ప్లాంటు మొదటిసారిగా ఇక్కడే ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు.
ప్లాంటు ద్వారా రోజుకు 250 లీటర్ల డీజిల్ తయారీ..
నగరపాలక సంస్థకు చెత్త తరలింపు, తాగునీటి సరఫరా కోసం ఆటోలు, ట్రక్కులు, ట్రాక్ట్రర్లు కలిపి 100 వరకు ఉన్నాయి. వీటికి రోజుకు సరాసరిన 2వేల లీటర్ల మేర డీజిల్ అవసరం. ప్రస్తుత ధర ప్రకారం చూస్తే రూ.లక్షా 60 వేల ఇంధన వ్యయం ఖర్చవుతోంది. జీఎంసీ ఏర్పాటు చేసిన ప్లాంటు ద్వారా రోజుకు 250 లీటర్ల డీజిల్ తయారవుతోంది. ఈ ప్లాంటు రోజుకు 3 టన్నుల సామర్థ్యంతో పని చేసేలా విస్తరిస్తే 15వందల లీటర్ల డిజిల్ వస్తుంది. అదే 4 టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తే కార్పోరేషన్ వాహనాల ఇంధన అవసరాలన్నీ తీరుస్తుంది. తద్వారా రోజుకు రూ.లక్షా 60వేలు రూపాయలు ఆదా అవుతాయి. ఇంధన ప్లాంటు ఏర్పాటు చేస్తే స్వయం సమృద్ధితో నడపొచ్చు.
కేంద్రం తీసుకొచ్చిన ఈపీఆర్ (ఎక్స్టెండెంట్ ప్రోడ్యూసర్ రెస్పాన్సిబులిటి) నిబంధనల మేరకు కంపెనీలు తమ ఉత్పత్తిని ప్లాస్టిక్ బాటిళ్లలో ఉంచి విక్రయిస్తే.. వాటి నిర్వహణ కూడా కంపెనీలదే. ఒకవేల వారు ఆ బాటిళ్లను నిర్వహించలేకపోతే సంబంధిత మున్సిపాలిటీలకు సహకరించాలి. ఆ ప్లాస్టిక్ ని నిర్వహించినందుకు అవసరమైన ఖర్చుని కంపెనీల నుంచి వసూలు చేసే హక్కు మున్సిపాలిటీలకు హక్కు ఉంటుంది. అలా వసూలయ్యే డబ్బు ద్వారా కూడా ప్లాంట్ ఏర్పాటు చేయవచ్చు. ఈ విషయంపై చర్చలు జరుపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కిలో ప్లాస్టిక్ ద్వారా అరలీటర్ డీజిల్
కిలో ప్లాస్టిక్ ద్వారా అర లీటర్ వరకు డీజిల్ వస్తోంది. అదే నాణ్యమైన ప్లాస్టిక్ లేదా పీపీఈ కిట్లు అయితే లీటర్ వరకూ డీజిల్ తయారవుతుంది. ఈ ప్రకారం నగరంలో పోగయ్యే 20 వేల కిలోల చెత్త విలువ రూ.8లక్షలకు పైగా ఉంటుంది. కానీ ఇపుడు ఆ ప్లాస్టిక్ మొత్తాన్ని తరలించేందుకు రవాణా, కూలీల రూపంలో కార్పొరేషన్‌కు ఖర్చవుతోంది. డ్రెయిన్లలో అడ్డుపడితే తొలగించేందుకు కూడా ఖర్చు చేయాల్సి వస్తోంది.
మన దేశంలో ఏ మున్సిపాలిటిలో కూడా ప్రైవేటు ఆపరేటర్ ఇలాంటి ప్లాంటు ఏర్పాటు చేయలేదు. చెత్తను తీసుకెళ్లి నిర్వహించినందుకు కొన్ని ప్రైవేటు కంపెనీలకు డబ్బులు ఎదురు ఇస్తున్నారు. అలా కాకుండా చెత్తనుంచి ఓ మున్సిపాలిటి డబ్బు సంపాదించే అవకాశాలు ఇంధన ప్లాంటు ద్వారా ఉన్నాయి.
ఇదీ చదవండి: