CM JAGAN MET PM MODI : రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు గడిచినప్పటికీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలావరకు ఇప్పటికీ నెరవేర్చలేదని, రెండు రాష్ట్రాల మధ్య ఇంకా చాలా అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయని ప్రధాని మోదీకి సీఎం జగన్ వివరించారు. 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద చెల్లించాల్సిన బకాయిలు రూ.18 వేల330 కోట్లు, 10వ వేతన సంఘం బకాయిలు, పింఛన్లు కలిపి మొత్తం 32 వేల 625 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు కేంద్రం నుంచి అందాల్సి ఉందన్నారు. వీటిని వెంటనే మంజూరు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
గత ప్రభుత్వం పరిమితికి మించి అధికంగా చేసిన రుణాలను, కేంద్ర ఆర్థిక శాఖ ఈ ప్రభుత్వంలో సర్దుబాటు చేస్తూ రుణాలపై పరిమితి విధిస్తోందని.. కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ ఆంక్షలు రాష్ట్రాన్ని బాగా దెబ్బతీశాయని.. అందుకనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. పోలవరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2 వేల 937 కోట్లు చెల్లించాలని కోరారు. అలాగే ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు పెంచిన అంచనాల మొత్తం 55 వేల 548 కోట్లకు ఆమోదం తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీని డీబీటీ ద్వారా చెల్లించాలని కోరారు. మిగిలన పనులు పూర్తి చేసేందుకు రూ.10 వేల485 కోట్లు ఇవ్వాలని కోరారు.
తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన 6 వేల 886 కోట్ల విద్యుత్ బకాయిలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కల్పనపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత వాటి సంఖ్య 26కు చేరిందని.. కేంద్రం కొత్తగా మంజూరుచేసిన 3 కాలేజీలతో కలుసుకుని ఇప్పటికి 14 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని తెలిపిన సీఎం.. మిగిలిన 12 జిల్లాలకు వెంటనే మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కడప సీల్‌ప్లాంట్ కోసం ఏపీఎండీసీకి గనులు కేటాయించాలని కోరారు.
విశాఖలో 76 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని.. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా సీఎం కోరారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని ప్రధానికి సీఎం వివరించారు.
ప్రధాని మోదీతో సమావేశం అనంతరం కేంద్ర పర్యావరణ, అటవీశాఖ కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌తో దాదాపు 40 నిమిషాల పాటు సీఎం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఎత్తిపోతలు, పోర్టులు, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్తు ప్రాజెక్టులకు త్వరగా పర్యావరణ అనుమతులు వచ్చేలా సహకరించాలని.... భూపేందర్ యాదవ్‌కుసీఎం విజ్ఞప్తి చేశారు. రాయలసీమ ఎత్తిపోతలు, మచిలీపట్నం, భావనపాడు పోర్టులు, వివిధ పంప్డ్ స్టోరేజ్ విద్యుత్తు ప్రాజెక్టుల అనుమతుల విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కరవుతో అల్లాడే ఈ ప్రాంతానికి తాగు, సాగునీరు అందించడానికి ఈ పథకం అత్యంత కీలకమైందన్న సీఎం.... కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి జలాశయాలు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరి స్తోందన్నారు. కృష్ణా నదీ యాజమాన్య మండలి నిర్వహణ ప్రొటోకాల్స్ ఒప్పందాలు, ఆదేశాలను ఉల్లంఘిస్తోందని తప్పుబట్టారు. దీంతో ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదిపై తన హక్కులను కోల్పోవాల్సి వస్తోందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండానే అనధికారికంగా పెద్ద ఎత్తున నిర్మిస్తున్న పాలమూరు- రంగా రెడ్డి ఎత్తిపోతల, డిండి పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిని వాడుకోవడానికి కూడా సాధ్యపడదన్న సీఎం.... దీంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అమలు చేయడం మినహా మరో ప్రత్యా మ్నాయం లేదన్నారు .
ఇవీ చదవండి: