రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజులను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. ప్రైవేటు అన్ఎయిడెడ్, వృత్తి విద్యాసంస్థల్లో 2019- 20 విద్యా సంవత్సరానికి బీటెక్ కోర్సులకు ఫీజులను ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది.
రాష్ట్రంలోని 281 కళాశాలలకు రుసుములను నిర్ణయించించిన ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్(ఏపీహెచ్ఈఆర్ఎమ్సీ)... తమ సిఫార్సులను ప్రభుత్వానికి పంపింది. కళాశాలల వారీగా 35 వేల నుంచి 70 వేల వరకు రుసుములను సిఫార్సు చేసింది. దీన్ని ఆమోదిస్తూ ఉన్నత విద్యాశాఖ మార్చి 24న జీవో నంబర్ 15ను జారీ చేసింది. ఆ జీవోను సవాల్ చేస్తూ 23 ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి.
ప్రవేశాలు, రుసుములు నియంత్రణ కమిషన్(ఏఎఫ్ఆర్సీ) చేసిన సిఫార్సులు పెండింగ్లో ఉండగా.. ఏపీహెచ్ఈఆర్ఎమ్సీ రుసుములను సిఫార్సు చేయడానికి వీల్లేదని కళాశాలల యాజమాన్యాల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆది నారాయణరావు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. విద్యా సంవత్సరం ప్రథమంలో రుసుములను ఖరారు చేయాల్సి ఉండగా.. చివర్లో నిర్ణయించడం సరికాదన్నారు.
మూడేళ్లకోసారి కోర్సుల రుసుములను నిర్ణయించాల్సి ఉండగా అందుకు భిన్నంగా ఏపీహెచ్ఈఆర్ఎమ్సీ ఏడాదికే రుసుములను సిఫార్సు చేసిందన్నారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్ రావు ప్రభుత్వం జారీచేసిన జీవో నంబర్ 15ను సోమవారం వరకు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీహెచ్ఈఆర్ఎమ్సీ ఛైర్మన్లను ఆదేశించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
ఇదీ చదవండి