House Demolition: ఎన్నో అక్రమ కట్టడాల కళ్ల ముందు కనిపిస్తున్నా పట్టించుకోని అధికారులు.. 50 ఏళ్లుగా ఉంటున్న తమ ఇంటిని కూల్చేసి రోడ్డున పడేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఏలూరు నగరంలోని మాదేపల్లి రోడ్డులో ఉనుకూరి వెంకటేశ్వరరావు మున్సిపాలిటీకి చెందిన మేకల కబేలా వద్ద వాచ్మెన్గా పని చేసేవాడు. ఉద్యోగ విరమణ తర్వాత కబేలా వద్ద.. చిన్న రేకుల షెడ్డు వేసుకొని అక్కడే తన ఐదుగురు ఆడ బిడ్డలతో జీవనం సాగిస్తున్నాడు.
గత 50 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ సిబ్బంది ముందస్తుగా ఏం చెప్పకుండా ఉన్న ఇంటిని కూల్చేశారు. దాంతో అందులో ఉంటున్న మూడు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రోడ్డు పక్కనే సామాన్లు పెట్టుకొని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. తన భర్త ఎంతో కాలంగా ఇక్కడే పని చేసి రిటైర్ అయ్యారని తమ ఇంటిని ఇల్లు కూడా అమ్ముకొని గత్యంతరం లేక ఇక్కడే ఉంటున్నామని వాపోయారు. తమకు న్యాయం చేసి ఆదుకోవాలని అధికారులు, ప్రజా ప్రతినిధులను బాధితులు కోరుతున్నారు.