సంక్షేమ పథకాలన్నీ విస్తృతంగా అమలు చేస్తున్నామని బాకాలు ఊదుతున్న జగన్ ప్రభుత్వానికి.. ఎన్నికల సంఘం, ఎన్నికలు అంటే ఎందుకు భయమో చెప్పాలని భాజపా రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్నేళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగక.. గ్రామస్థాయిలో అభివృద్ధి కుంటుపడి, అవినీతి పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ సమన్వయంతో పని చేయవలసిన తరుణంలో.. ఒకరితో మరొకరు కీచులాడుకోవడం దురదృష్టకరమన్నారు. స్థానిక ఎన్నికలు వీరువురి పరువు, ప్రతిష్ట సమస్య కాదని.. ఐదున్నర కోట్ల ప్రజల భవిష్యత్తు తేల్చేవని తెలిపారు.
స్థానిక ఎన్నికలకు భాజపా సిద్ధమేనన్న ఆయన.. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎన్నికల సంఘం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని రవికిరణ్ డిమాండ్ చేశారు. ఏప్రిల్, మేలో స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్ర మంత్రుల ప్రకటన ద్వారా.. ఈ ప్రభుత్వానికి కరోనా టీకా సమస్య కాదని, కేవలం కుంటి సాకులేనని అర్థమవుతోందన్నారు. ప్రస్తుత ఈసీ పదవీ కాలం ముగిసే లోపు ఎన్నికలు నిర్వహించకూడదన్న మంకు పట్టుదలేనని అభిప్రాయపడ్డారు. ఇరుపక్షాల అహంకార ప్రవర్తన రాష్ట్రానికి చేటు కలిగిస్తోందని, రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సర కాలంగా ఇరుపక్షాలు తరచూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ.. సుమారు రూ. 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వం ఓ మెట్టు దిగి, రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవిస్తూ.. ఎన్నికలకు సిద్ధం కావాలని రవికిరణ్ హితవు పలికారు.
ఇదీ చదవండి: పవన్ మాట్లాడింది కనీసం తనకైనా అర్థమైందా..?