Nara Lokesh Meet Arya Vaishyas: వైఎస్సార్సీపీ పాలనలో ఆర్య వైశ్యులను వేధిస్తూ.. జే ట్యాక్స్ పేరుతో హింసిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఏడవ రోజు పాదయాత్ర ప్రారంభానికి ముందు రామాపూరం సమీపంలోని విడిది కేంద్రం వద్ద ఆర్యవైశ్య సామాజికవర్గం ప్రతినిధులతో లోకేశ్ భేటీ అయ్యారు. అనంతరం నియోజకవర్గానికి చెందిన పలువురు యువతతో పాటు కొన్ని ముస్లిం కుటుంబాల సభ్యులు టీడీపీలో చేరారు. పార్టీ బలోపేతానికి అంతా కృషి చేయాలని, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని లోకేశ్ పిలుపునిచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్య వైశ్యులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ నాయకుల వేధింపులకు ఆర్య వైశ్యులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. టీడీపీ హయాంలో ఆర్య వైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 30 కోట్ల నిధులు ఇచ్చామని గుర్తు చేశారు. 2014 నుంచి 2019 వరకు అన్ని పదవుల్లో అగ్రతాంబూలం ఇచ్చామని తెలిపారు. వైఎస్సార్సీపీ పాలనలో ఆర్య వైశ్యులకు ఉన్న మంత్రి పదవి కూడా పీకేశారని తెలిపారు. ఆర్య వైశ్యులు అర్ధికంగా, రాజకీయంగా ఎదిగేందుకు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు.
"వైశ్యులందరినీ ఒక్కసారి ఆలోచించమని అంటున్నాను. మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకొని.. అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వైశ్యులకు మంత్రి పదవి ఉండేది. కానీ మొదటి సారి ఆర్య వైశ్యులకు ఉన్న మంత్రి పదవి కూడా పీకేశారు. మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకుంటాం". - నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
ఇవీ చదవండి: