"రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టిన వైకాపా, దైవ సాక్షిగా ప్రమాణం చేసిన భాజపా, దానికి మద్దతు తెలిపిన తెదేపా తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ మొహంతో పోటీ చేస్తున్నాయి" అని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ విమర్శించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రత్యేక హోదాను పాచిపోయిన లడ్డూలతో పోల్చిన జనసేన.. ఆ లడ్డూలనే తినేందుకు అలవాటుపడి భాజపాకు మద్దతిస్తోందని మండిపడ్డారు. మన్నవరం బెల్ పరిశ్రమతో పాటు రామాయపట్నం, దుగ్గరాజుపట్నం పోర్టులను రాష్ట్రానికి తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇటీవల కాలంలో పార్లమెంట్లో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వమని చెప్పిన భాజపా.. ఎవరిని మోసం చేసేందుకు మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారని విమర్శించారు.
"అసమర్థ ప్రభుత్వం.."
రెగ్యులర్ బడ్జెట్ కూడా పెట్టలేని దైన్య స్థితిలో ప్రభుత్వం నడుస్తోందని.. వైకాపా అసమర్థత పాలనకు ఇదే నిదర్శనమని శైలజానాథ్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజా సంక్షేమం పట్టలేదని.. అసెంబ్లీ అంటే కనీస గౌరవం లేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు మొదలు అన్నింటికీ సమాధానం చెప్పిన తర్వాతే పార్టీలన్నీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తెస్తామని అన్నారు.
ఇదీ చదవండి: