నవరత్నాల్లో కీలకమైన అమ్మఒడి పథకానికి సీఎం జగన్ నేడు శ్రీకారం చుట్టనున్నారు. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు చిత్తూరులోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. అంతకుముందు పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం పరిశీలిస్తారు. స్థానికంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అనంతరం భారీ సభలో ప్రసంగిస్తారు. సభస్థలి ఏర్పాట్లను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పరిశీలించారు. ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితర అధికారులతో సమీక్షించారు.
అమ్మఒడి పథకం కింద ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయంగా ప్రభుత్వం 15 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. 2019-20 విద్యాసంవత్సరానికి మొత్తం 43 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. నేరుగా విద్యార్ధుల తల్లి లేదా సంరక్షకుల బ్యాంకు ఖాతాలో ఏటా జనవరిలో ఆ మొత్తం జమ అవుతుంది. దీనికోసం 6 వేల 500 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందుకోసం ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల నుంచి నిధుల మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ పథకం వర్తిస్తుంది.
జగనన్న అమ్మ ఒడి పథకం అమల్లో భాగంగా 75 శాతం హాజరు ఉండాలన్న నిబంధనకు ప్రభుత్వం ఈ ఏడాది మినహాయింపు ఇచ్చింది. పథకం ప్రవేశపెట్టిన తొలి ఏడాది కావటంతో శాతం మేర హాజరు ఉండాలన్న నిబంధనకు సైతం ప్రభుత్వం మినహాయింపు ను ఇచ్చింది. డ్రాపవుట్ల సంఖ్య తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు 300 యూనిట్ల విద్యుత్ వినియోగం , సమగ్ర శిక్ష, కస్తూర్బాగాంధీ బాల్ వికాస్ కేంద్ర ఇతర విభాగాలకు చెందిన అవుట్ సోర్సింగ్ , కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బందిని ఈ పథకానికి అనర్హులను ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఇదీచదవండి