రాష్ట్రంలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా సాయంత్రం వేళల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన జల్లులు పడతాయని స్పష్టం చేసింది. 45 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయవచ్చని తెలియజేసింది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కూడా పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలియచేసింది.
చత్తీస్గఢ్ నుంచి దక్షిణ కర్ణాటక వరకూ, తెలంగాణా నుంచి కోస్తాంధ్ర,రాయలసీమ మీదుగా కర్ణాటక వరకూ రెండు వేర్వేరు ఉపరితల ద్రోణులు కొనసాగుతున్నట్టు తెలియజేసింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలూ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కొన్నిచోట్ల సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.
జిల్లా | పిడుగు హెచ్చరిక ప్రాంతాలు |
గుంటూరు | నూజెండ్ల, బోళ్లపల్లి, ఈపూరు, నకరికల్లు, రొంపిచర్ల, సవల్యాపురం |
ప్రకాశం | మర్రిపూడి, పొదిలి, దర్శి, కొనకనమిట్ల, కురిచేడు, |
ముండ్లమూరు, తాళ్లూరు, అద్దంకి, సి.ఎస్.పురం | |
చిత్తూరు | పీలేరు |
విజయనగరం | గంట్యాడ, శృంగవరపుకోట, బొబ్బిలి, బలిజిపేట |
విశాఖ | కొయ్యూరు, గోలుగొండ, అరకు, కోటారుట్ల |
తూర్పు గోదావరి | రంపచోడవరం, మారేడుమిల్లి, వై.రామవరం, అడ్డతీగల |