అమరావతిలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ అంతర్గత సమావేశంలో నేతలు తమతమ అభిప్రాయాలు వెల్లడించారు. తాజా సార్వత్రిక సమరంలో పార్టీ పరాజయానికి గల కారణాలు విశ్లేషించారు. నేతల అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి.
నేతలు, ప్రజాప్రతినిధులు... వేల మందితో నిర్వహిచిన చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లను సీనియర్ నేత అశోక్ గజపతిరాజు తప్పుబట్టారు. కాన్ఫరెన్స్‌ల వల్ల వాస్తవాలు చెప్పే అవకాశం లేకుండా పోయిందనే అభిప్రాయపడ్డారు.
తెదేపాలో మానవ సంబంధాలు తగ్గిపోయాయని జూపూడి ప్రభాకర్ పేర్కొన్నారు. కార్యకర్తలు, నేతలకు చంద్రబాబు చాలా దూరం అయ్యారనే అభిప్రాయం ఏర్పడిందన్న జూపూడి... పార్టీ నిర్లక్ష్యానికి గురవుతున్న విషయం పెద్దలు గుర్తించలేదు అన్నారు.
రియల్ టైం గవర్నెన్స్ నివేదికలు కొంప ముంచాయని ఎమ్మెల్సీ గౌరవాని శ్రీనివాసులు చెప్పారు. గతంలో... ఇప్పుడూ అధికారులను పక్కన పెట్టుకోవడం వల్లనే నష్టం జరిగిందని శ్రీనివాసులు తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
కోడెల కుటుంబ అక్రమాలపై జనం ఎన్నికల సమయంలొనే ప్రస్తావించారని అధికార ప్రతినిధి దివ్యవాని చెప్పారు. గ్రామస్థాయిలో నేతల అవినీతిపై అధినేతకు చెప్పే అవకాశమే లేకుండా చేశారని అన్నారు. చంద్రబాబు చుట్టూ చేరిన బృందం వాస్తవాలు తెలియకుండా చేశారని దివ్యవాణి వివరించారు.
విభేదాలు వీడి కలిసి ముందుకు సాగుతామని అనంతపురం జిల్లా నేతలు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు కలిసి లేకపోతే మరింత నష్టం జరుగుతుందని హెచ్చరించారు.
పార్టీలో లీగల్ వింగ్ పటిష్ఠపరచాలని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సూచించారు. వైకాపా తమపై పెడుతున్న కేసులను చర్చించేందుకు లీగల్ సెల్ ఏర్పాటు చేయాలని కోరారు.
ఇదీ చదవండీ...