Kolikapudi Srinivasa Rao: ప్రభుత్వ విధానాల కారణంగానే రాష్ట్రంలో రైతులు పంట విరామం ప్రకటిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. బాపట్ల జిల్లా అమర్తలూరు మండలంలో పంట విరామం ప్రకటించిన గోవాడ, పాంచాళవరం గ్రామాల్లో ఆయన పర్యటించారు. రైతులతో మాట్లాడి పంట విరామానికి దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ.. రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవటం లేదని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించటం లేదని శ్రీనివాసరావు ఆరోపించారు.
రైతులు పెట్టిన పెట్టుబడి నష్టపోయి.. అప్పులు పాలైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉపశమన చర్యలు లేవని కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. పెట్టుబడి రాయితీ, పంటల బీమా పథకాలు ప్రచారానికే తప్ప.. రైతులకు అందటం లేదని ఆరోపించారు. వ్యవసాయంలో పెట్టుబడులు, ఎరువులు, కూలీల, కౌలు రేట్లు పెరిగిన మేరకు .. పంటలకు ధర పెరగకపోవటమే అసలు కారణమని చెప్పారు. ముఖ్యమంత్రి.. ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి రైతుల సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: