Votes Deletion Issue in Uravakonda Constituency: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు వ్యవహారంలో మరో ఉన్నతాధికారి సస్పెన్షన్ వేటు పడింది. అనంతపురంలో గతంలో జడ్పీ సీఈఓగా ఉన్న శోభా స్వరూపా రాణీని సస్పెండ్ చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓట్ల తొలగింపు వ్యవహారంలో ఇప్పటికే జడ్పీ సీఈఓ భాస్కర్ రెడ్డి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.
కాగా ప్రస్తుతం ఆయన కంటే ముందు అదే స్థానంలో పని చేసిన స్వరూపా రాణి పైనా సస్పెన్షన్ వేటు పడింది. గతంలో అనంత జడ్పీ సీఈఓగా పని చేసిన సమయంలో ఉరవకొండ నియోజకవర్గంలో అక్రమంగా ఓట్ల తొలగింపునకు బాధ్యురాలిని చేస్తూ సస్పెన్షన్ చేశారు. ప్రస్తుతం స్వరూపా రాణి బాపట్ల జిల్లాలో ఈటీసీ (Extension Training Centre)కు గెజిటెడ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఉరవకొండ నియోజకవర్గంలో 2020, 2021 సంవత్సరాలలో అనంతపురం జడ్పీ సీఈఓగా పని చేసిన సమయంలో అక్రమంగా 1796 ఓట్లను తొలగింపుపై తాజాగా చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో టీడీపీ మద్దతుదారులకు చెందిన ఓట్లను.. నోటీసులు ఇవ్వకుండానే అధికారులు తొలగించారు.
ఫారం-7కు సంబంధించి అనుసరించాల్సిన నిబంధనలను పాటించకుండా ఒకే దరఖాస్తుపై పెద్ద మొత్తంలో ఓట్లను జాబితా నుంచి తీసేశారు. దీనిపై ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ గత సంవత్సరం అక్టోబర్ 27వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యులైన అధికారులపైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.
Mistakes in Uravakonda Voters List ఆ 50 ఇళ్లకు.. మూడే డోర్ నెంబర్లు! బాబోయ్ ఇదేం లెక్క..
దీంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారులపై చర్యలు తీసుకోక తప్పలేదు. తాజా చర్యలతో అధికార పార్టీ కోసం నిబంధనలకు విరుద్దంగా పని చేసిన అధికారుల్లో తీవ్ర కలవరం నెలకొంది. నిబంధనలకు విరుద్దంగా ఓట్ల తొలగింపు పాపం తమ మెడకు చుట్టుకుంటుదనే ఆందోళనలో అధికారులున్నారు.
Anantapur ZP CEO Bhaskar Reddy Suspended: అనంతపురం జిల్లా పరిషత్ ప్రధాన ఎన్నికల అధికారి కె.భాస్కర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు భాస్కర్‌రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా గత కొంతకాలంగా ఒట్ల తొలగింపుపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. వీటిపై చర్యలు తీసుకోవాలని చెబుతున్నాయి. దీంతో ఎన్నికల సంఘం గట్టిగా చెప్పడంతో చర్యలు తీసుకోకతప్పలేదు. అయితే కేవలం అనంతపురంలో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో కూడా భారీగా ఓట్ల తొలగింపు, ఒకే ఇంటి నెంబర్ మీద వందల కొద్దీ ఓట్లు ఉండటం వెలుగుచూశాయి.
Bogus Votes in AP : ' 37 మంది ఓటర్లకు తండ్రి పేరు ఒకటే'.. విచారణ చేపట్టిన అధికారులు