తీవ్ర వర్షాభావం, కరవు కష్టాలు రైతులకే కాదు.. దేవుడికీ తప్పడం లేదు. అనంతపురం జిల్లాలో వర్షాభావంతో చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో గణేష్ నిమజ్జన వేడుక.. అధికారులకు, భక్తులకు కష్టాలు తెచ్చి పెడుతోంది. ఏటా గణనాథులను అనంతపురం నుంచి ప్రవహించే హెచ్.ఎల్.సీ.. కాలువలో నిమజ్జనం చేయటం ఆనవాయితీ. ఈసారి వర్షాలు ఆలస్యం కావడం వల్ల హెచ్.ఎల్.సీలో నీటి కొరత ఏర్పడింది. నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ప్రవహించే హంద్రీనీవా కాలువలో విగ్రహాలను నిమజ్జనం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆత్మకూరు మండలంలోని పంపనూరు వద్ద ప్రవహించే హంద్రీనీవా కాలువకు నీటి ప్రవాహాన్ని పెంచేందుకు జలవనరులశాఖ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. నగరంలోని విగ్రహాలన్నీ పంపనూరు వద్ద నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు.
ఏకంగా 20కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరగనుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. జిల్లాలోని పలుచోట్ల నుంచి డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, 600 మందికి పైగా పోలీసులతో భద్రత పర్యవేక్షిస్తున్నారు. నిమజ్జనానికి ముందు నిర్వహించే శోభాయాత్రలో 50 వేల మందికి పైగా పాల్గొంటారని పోలీసులు అంచనా వేశారు. ఈ దిశగా అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.