గతంతో పోలిస్తే నీటి అవసరాలు పెరిగాయి. నీటి లభ్యత ఆధారంగా ప్రస్తుతం మనిషికి రోజుకు సరాసరి 40 లీటర్లు సరఫరా చేస్తున్నా అదీ అరకొరే.. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రజల దాహార్తి తీరడం లేదు. అత్యవసరం కింద ఏటా ఆర్థిక సంఘం, సాధారణ నిధుల నుంచి పంచాయతీలకు పెద్ద మొత్తంలో తాగునీటి సరఫరాకు ఖర్చు చేస్తున్నా ఒనగూరుతున్న ఫలితం అంతంత మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యపై దృష్టి సారించింది. ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ ఏడాది ‘జలజీవన్ మిషన్ పథకం’ అమలుకు శ్రీకారం చుట్టింది. 2024 నాటికి ప్రతి ఇంటికీ తాగునీటి కనెక్షన్ ఇవ్వాలన్నది లక్ష్యం. ఇందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు సమగ్ర పథక నివేదిక (డీపీఆర్)ను తయారు చేశారు.
- 2.75 లక్షల నివాసాలకు లబ్ధి
జిల్లాలో 1,040 పంచాయతీల్లో 3,300 వరకు గ్రామాలు ఉండగా.. 12.26 లక్షల కుటుంబాలు.. అందులో 42 లక్షల జనాభా ఉంది. ఇప్పటి వరకు జిల్లాలో 1.70 లక్షల నుంచి 2 లక్షలలోపు ఇళ్లకు మాత్రమే కొళాయి కనెక్షన్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కొత్తగా మరో 2.75 లక్షల నివాసాలకు ‘జలజీవన్ మిషన్’ కింద కొళాయి కనెక్షన్ ఇచ్చేలా ప్రణాళిక తయారు చేశారు. అందుకు రూ.550 కోట్లు అవసరమని డీపీఆర్‌ను సిద్ధం చేసి ప్రతిపాదించారు. దీని ప్రకారం అన్ని గ్రామాల్లో ఇప్పటి వరకు నడుస్తున్న రక్షిత నీటి పథకాల కిందనే కొత్తగా కొళాయిలు మంజూరు చేస్తారు. ఒక్కో మనిషికి 55 లీటర్ల నీటిని అందిస్తారు. నీటి వనరుల లభ్యత గురించి ప్రాజెక్టులో ప్రస్తావించలేదు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న పథకాల ద్వారానే నీటిని ఇచ్చేలా మార్గదర్శకాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించనున్న నిధులతో కేవలం ఇంటింటికీ కొళాయి కనెక్షన్లు ఇవ్వడానికి వీలుగా తాగునీటి పైపులైన్ మాత్రమే విస్తరించనున్నారు.
చేపట్టే పనులివే...
- స్థానికంగా అందుబాటులో ఉన్న నీటి వనరుల సమీకరణ.
- ప్రస్తుత వనరుల్లో నీటి సామర్థ్యం పెంచేలా ట్యాంకుల నిర్మాణం.
- వినియోగంలో ఉన్న అంతర్గత పైపులైన్ల విస్తరణ.
- రెట్రో ఫిట్టింగ్ ద్వారా కొత్త పైపులైన్లను నిర్మించడం.
గ్రామీణ ప్రాంతాలకు ఉపశమనం
జిల్లాలో ఇంటింటికి కొళాయి ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. జలజీవన్ మిషన్ కింద జిల్లాలో 2.75 లక్షల ఇళ్లకు కొత్తగా కొళాయిలు ఇవ్వాలని నిర్ణయించాం. నీటి వనరుల సమీకరణ, ఉన్న వాటిలోనే నీటి సామర్థ్యం పెంచడం, అంతర్గత పైపులైన్ల నిర్మాణం వంటి పనులకు ప్రతిపాదనలు పంపాం. ఈ పథకం కింద కేవలం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే ఇంటింటికి కొళాయి కనెక్షన్ ఇవ్వనున్నాం- హరేరామనాయక్, గ్రా.నీ.స, ఎస్‌ఈ
ఇదీ చదవండి: చంద్రగిరిని కలవరపెడుతున్న కరోనా కేసులు