అనంతపురం జిల్లాలో 1833లో డొక్కల కరవు వచ్చింది. మనుషులతోపాటు పశువులు మృతి చెందాయి. 1817లో కలరా, 1896లో ప్లేగు వ్యాధితో ఎందరో మృతి చెందారు. అప్పట్లో దత్త మండలాలను పరిపాలించిన కలెక్టర్లు సర్ థామస్ మన్రో, బ్రౌన్ ప్రజల్లో చైతన్యాన్ని నింపి అండగా నిలిచారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా 1942లో క్విట్ ఇండియా ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ‘డు ఆర్ డై’ నినాదం దేశమంతా విస్తరించింది. అప్పట్లో జిల్లావాసులు, విద్యార్థులు ఉద్యమానికి అండగా నిలిచారు. అనంతపురం అంటేనే గుర్తుకొచ్చేది కరవు. అతివృష్టి, అనావృష్టి వెంటాడుతున్నాయి. అన్నదాతలు ఏటా పంటలు నష్టపోతూనే ఉన్నారు. ఏళ్ల తరబడి కరవుకాటకాలను ఎదుర్కొంటున్న ప్రజలకు కరోనా ఓ లెక్కా..!
భయం వీడాలి..
ధైర్యంతో సాగితే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చని చరిత్ర చెబుతోంది. మనిషిలో భయం ఉంటే రోగ నిరోధకశక్తిని బలహీన పరుస్తుంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అశాస్త్రీయమైన సమాచారాన్ని పట్టించుకోకూడదు. కొవిడ్ లక్షణాలు కనిపించగానే నిర్లక్ష్యం చేయొద్దు. అధికారులు, ప్రభుత్వం, వైద్యులు చెప్పే అంశాలనే ప్రామాణికంగా తీసుకోవాలి. అవగాహన, ధైర్యం ఉంటే కరోనాను జయించడం సులువే.
ఇల్లే స్వర్గసీమ
ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లే స్వర్గసీమ. కొన్నిరోజుపాటు ఇంటిని వైద్యశాలగా, గ్రంథాలయం మార్చుకోవాలి. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ.. పౌష్టికాహారం తీసుకోవాలి. పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలి. అరచేతిలో అంతర్జాలం ఉండటంతో నచ్చిన పుస్తకాన్ని ఆన్‌లైన్‌లోనే చదవొచ్చు.
ఇష్టమొచ్చిన రంగంపై పట్టు
అందరూ ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం చేయడం పెద్ద కష్టమేమీ కాదు. టీవీల్లో వచ్చే సీరియళ్లు, చరవాణికి కాసేపు దూరంగా ఉండొచ్చు. పెరట్లో మొక్కల పెంపకంతో సమయం గడపవచ్చు. తమకు ఇష్టమున్న రంగంపై పట్టు సాధించేందుకు ఇదో చక్కటి అవకాశంగా భావించాలి. చిత్రలేఖనం, నటన, నృత్యం.. ఇలా నచ్చిన అంశాన్ని ఎంపిక చేసుకుని సాధన చేయవచ్చు.
తల్లిదండ్రులే గురువులు
కర్ఫ్యూతో పాఠశాలలు మూతపడ్డాయి. విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులే గురువులుగా మారాలి. పిల్లల సందేహాలను నివృత్తి చేయాలి. మీ చిన్ననాటి విషయాలు చెబుతూ ఆసక్తి రగిలించాలి. నీతి కథలు చెప్పాలి. విలువలు నేర్పాలి. ఆధ్యాత్మిక చింతన పెంపొందించాలి.
నెట్టింట్లో ఉందాం
విద్యార్థులు, ఉద్యోగులు ఎవరైనా నచ్చిన కోర్సు ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. కోర్సు ఎరా, స్వయం లాంటి ఆన్‌లైన్ వేదికలలో కొత్త కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా నిపుణుల పాఠాలు వినొచ్చు. విద్యార్థులకు ఎంసెట్, నీట్, జేఈఈ, గేట్‌కు సంబంధించిన నమూనా ప్రశ్న పత్రాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. నట్టింట్లో ఉంటూనే నెట్టింట్లో నచ్చిన అంశాలు నేర్చుకోవచ్చు.
బంధాలు బలపడేలా..
పోటీ ప్రపంచంలో ఉద్యోగం, చదువు అంటూ మానవ సంబంధాలు మరిచిపోయాం. ప్రస్తుతం అందరికీ తీరిక దొరికింది. ఇంట్లో ఉంటూనే బంధువులు, స్నేహితులతో ఫోన్ ద్వారా మాట్లాడితే బంధాలు బలపడతాయి. వీడియో కాల్‌లోనూ మాట్లాడవచ్చు. విపత్కర సమయంలో మిత్రులు, బంధువుల ఇంట్లో జరిగే చిన్న చిన్న కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లొద్దు. మరీ అవసరం అనుకుంటే మాస్క్‌ను ధరించి భౌతిక దూరం పాటించి హాజరు కావాలి.
ఇదీ చదవండి: