ప్రమాదవశాత్తు చెరువులో పడి తల్లి కుమారుడు మృతి - అనంతపురం జిల్లాలో చెరువులో పడి తల్లి కోడుకు మృతి
ప్రమాదవశాత్తు చెరువులోపడి తల్లి, కుమారుడు ఇద్దరు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా గుండుమల గ్రామంలో జరిగింది. తల్లి, కుమారుడి మరణ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అనంతపురం జిల్లా మడకశిర మండలం గుండుమల గ్రామంలో విషాదం జరిగింది. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం... నరసమ్మ(35) అనే మహిళ అమె కొడుకు నవదీప్(10) ను వెంటబెట్టుకొని చెరువు వద్దకు వెళ్లింది. నరసమ్మ బట్టలు ఉతుకున్న సమయంలో కుమారుడు నవదీప్ కాలుజారీ చెరువులోని గుంతలో పడ్డాడు. నవదీప్‌ను రక్షించే క్రమంలో తల్లి ఆత్రుతతో ముందుకు వెళ్లింది. గుంతలో నీరు అధికంగా ఉండటంతో కొద్ది సమయం కోట్టుమిట్టాడి తల్లికోడుకు ఇద్దరు ప్రాణాలు వదిలారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు చెరువులో గాలించగా మెుదట తల్లి నరసమ్మ మృతదేహం లభ్యమైంది. కుమారుడి మృతదేహం ఎంతసేపటికి దొరక్కపోవడంతో అగ్నిమాపక శాఖ వారి సహాయంతో నవదీప్ మృతదేహం వెలికితీశామని గ్రామస్తులు తెలిపారు.