People suffering from fever: వాతావరణంలో మార్పులు, అధ్వాన పారిశుద్ధ్యం, రేయింబవళ్లు రక్తం పీల్చే దోమలు.. పెద్ద పైపు ఊటనీరు.. ఫలితంగా పలు వీధుల్లో ఒక్కసారిగా జ్వరాలు ప్రబలాయి. ఇదెక్కడో మారుమూల ప్రాంతంలో కాదు.. అల్లూరి జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో దుస్థితి ఇది. చింతపల్లిలో ప్రజలు జ్వరాలతో అల్లాడిపోతున్నారు. ప్రతీ ఇంటికీ ఒకరు జ్వర బాధితులు మంచానపడుతున్నారు.
ముఖ్యంగా మండల కేంద్రంలోని కుమ్మరవీధి, పెదపైపు, నెయ్యిల వీధుల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ లక్షణాలతో బాధపడుతున్నారు. బాధితుల్లో 12 ఏళ్లలోపు పిల్లలే అధికంగా ఉన్నారు. వారం రోజుల నుంచి జ్వరాలు ఎక్కువ మందికి వస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన: చింతపల్లిలోని కుమ్మరవీధి, పెదపైపు, నెయ్యలవీధి, మైలుకూలివీధి, సాడికపేట, రామాలయం వీధుల్లో ఏటా మే, జూన్ నెలల్లో డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలు ప్రబలుతుంటాయి. ఈ ఏడాది తొలుత పెదపైపు, కుమ్మరవీధిల్లో జ్వరాలు ప్రబలాయి. బాధితులను చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించినప్పటికీ జ్వరాలు తగ్గుముఖం పట్టకపోవడంతో.. ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని బాధితులు వాపోతున్నారు. దీని కారణంగా అధిక ఖర్చులు అవుతున్నాయని.. చాలా మంది పేదవాళ్లమని తెలుపుతున్నారు.
మరికొందరు స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. జ్వరం ఎందుకు వచ్చిందో ప్రభుత్వ ఆస్పత్రిలో చెప్పడం లేదని, ప్రైవేటు వైద్యుల వద్దకు వెళితే డెంగ్యూ, టైఫాయిడ్‌గా చెబుతున్నారని బాధితులు అంటున్నారు. మెరుగైన చికిత్స అందించాలని ప్రజలు కోరుతున్నారు.
ఎక్కువగా ఈ ప్రాంతాల్లో: పెదపైపు, కుమ్మరవీధుల్లో ఎక్కువగా జ్వరబాధితులు ఉన్నారు. కుమ్మరవీధిలో 25 మంది తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. వైద్య సిబ్బంది సకాలంలో స్పందించి మెరుగైన చికిత్స అందించకపోతే పరిస్థితి మరింత తీవ్రతరం అవుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
దీనిపై స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్.. వాతావరణ మార్పులు, నీరు, దోమలు కారణంగా ఎక్కువ మందికి జ్వరాలు వస్తున్నాయని అన్నారు. అందరికీ పరీక్షలు చేస్తున్నట్లు.. అదే విధంగా చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ కీర్తి తెలిపారు. ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీళ్లు మారడం వలన జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయని.. వేడి చేసిన నీటిని తాగడం ఉత్తమం అని తెలిపారు.
"వైరల్ జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా ఉన్నది నిజమే. వాతావరణ మార్పులు, వర్షాలు, నీళ్లు మారడం అదే విధంగా దోమలు.. వీటి వలన జ్వరాలు వస్తున్నాయి. దీని కారణంగా ఎక్కువ మంది ఆసుపత్రికి వస్తున్నారు. అందరికీ పరీక్షలు చేసి.. సకాలంలో చికిత్స అందిస్తున్నాము". - కీర్తి, ఆస్పత్రి సూపరింటెండెంట్
ఇవీ చదవండి: