రాజస్థాన్ జైపుర్‌కు చెందిన 19 ఏళ్ల రైఫిల్ షూటర్ అవని లేఖరా.. టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొన్న పిన్న వయస్కురాల్లో ఒకరు. 2012లో పదేళ్ల వయసులో ఈమెకు కారు ప్రమాదం. తన వెన్ను పూస విరిగిపోయింది. నడుము కింద భాగం చచ్చుబడి చక్రాల కుర్చీకే పరిమితమైంది. మూడేళ్లపాటు ఎన్నో సర్జరీలు, ఫిజియోథెరపీ సెషన్లు.. చేసినా ఫలితం లేకుండా పోయింది. బడిలో చేర్చుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల రెండేళ్లు ఇంట్లోనే చదువుకుంది. తర్వాత కేంద్రీయ విశ్వవిద్యాలయంలో(Kendriya vidyalaya) సీటు దొరికింది.
ప్రేమలో పడిపోయాను..
బాధను దిగమింగుకుని ఏదైనా రంగంలో పట్టు సాధించాలని నిర్ణయించుకుంది. తన నాన్న సూచన మేరకు ఆయనోసారి ఆర్చరీ, షూటింగ్ రేంజ్‌లకు తీసుకెళ్లారు. అక్కడ మొదటిసారి రైఫిల్‌ను చేతితో తాకినప్పుడే దాంతో ప్రేమలో పడిపోయాను. నాలో స్ఫూర్తి నింపడానికి ఆయన... అభినవ్ బింద్రా(abhinav bindra) రాసిన 'ఎ షాట్ ఎట్ హిస్టరీ'(a shot at history) పుస్తకం ఇచ్చారు. అది చదివాక సీరియస్‌గా సాధన ప్రారంభించా. ఎప్పటికైనా దేశానికి బంగారు పతకం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా' అని అవని చెబుతోంది.
మొదటి ఏడాదే మూడు పతకాలు..
గత కొన్నేళ్లుగా అవని సాధించిన విజయాలు ఆమె పట్టుదలకు నిదర్శనం. శిక్షణ తీసుకున్న మొదటి ఏడాదే జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో మూడు పతకాలు సొంతం చేసుకుంది. అప్పటికి ఆమెకో సొంత రైఫిల్ కూడా లేదు. కోచ్ దగ్గర అరువు తెచ్చుకుంది. 2017లో ఆన్‌ఐన్‌ఓలో జరిగిన పారా షూటింగ్ వరల్డ్‌కప్‌లో రజతం గెలుచుకుంది. కరోనా(Carona) కారణంగా గతేడాది నుంచి ఫిజియోథెరపీ సెషన్‌లు లేకపోయినా.. సరైన శిక్షణా, సదుపాయాలు, పరికరాలు లేకపోయినా.. ఇంటి దగ్గరే సాధన చేసి పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని ముద్దాడింది.
"అసాధారణ ప్రదర్శన అవని లేఖారా. బంగారు పతకాన్ని ఎంతో కష్టపడి గెలుచుకున్నందుకు అభినందనులు. మీ శక్తి, షూటింగ్‌పై ఉన్న మక్కువ కారణంగానే ఇది సాధ్యమైంది. మన దేశంలో క్రీడలకు నిజంగా ప్రత్యేక క్షణం. మీ భవిష్యత్తుకు శుభాకాంక్షలు" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి: