"చాను.. చాను" ఇప్పుడు దేశమంతా మారుమోగిపోతున్న పేరు ఇది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన మీరాబాయి చాను ఇప్పుడు దేశంలో ఓ సూపర్ హీరో! వెయిట్‌లిఫ్టింగ్ మహిళల 49 కేజీల విభాగంలో.. రజతం గెల్చుకుని స్వదేశానికి తిరిగొచ్చిన చానుపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ ద్వారా "ఈటీవీ భారత్" చానును ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది చాను.
దేశం తరఫు రజత పతకం గెలవడం ఎలా అనిపించింది?
ఇదొక గొప్ప అనుభూతి. మాటల్లో చెప్పడం కష్టం. దేశానికి తిరిగి వచ్చినప్పటి నుంచి నాపై దేశ ప్రజలు ప్రేమ చూపిస్తున్నారు. విమానంలో, ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. నాకు చాలా సంతోషంగా ఉంది.
మీకు పిజ్జా అంటే ఇష్టమన్నారు కదా. ఇప్పటివరకు ఎన్ని పిజ్జాలు తిన్నారు?
(నవ్వుతూ)చాలా పిజ్జాలు ఆరగించేశాను. ఇండియాకు తిరిగి వచ్చినప్పటి నుంచి పిజ్జాలే తింటున్నా. లెక్క పెట్టలేనన్ని తిన్నా.
ఐదేళ్ల ముందు జరిగిన రియో ఒలింపిక్స్ క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో మీరు గెలవలేకపోయారు. కానీ వెనకడుగు వేయలేదు. ఈ విషయంలో మీకు ఏ విధంగా స్ఫూర్తి లభించింది?
నేను అరంగేట్రం చేసింది రియో ఒలింపిక్స్‌లోనే. చాలా కష్టపడ్డా. రియోలో గెలిచే అవకాశం వచ్చింది. రియో ట్రయల్స్‌లో ఎత్తిన బరువును.. ప్రధాన ఈవెంట్లో ఎత్తి ఉంటే అక్కడ కూడా రజతం దక్కేది. కానీ అది జరగలేదు. ఆ రోజున దేశానికి పతకం తీసుకురానందుకు చాలా బాధపడ్డా. ఎంత కష్టపడ్డా, ఎంత కఠోర శిక్షణ తీసుకున్నా.. ఎందుకు ఓడిపోయానో అర్థం కాలేదు. ఆ తర్వాత ఎన్నో రోజులు సరిగ్గా తినలేదు. ఆ సమయంలో నా కుటుంబం, విజయ్ సర్ నాకు అండగా నిలిచారు. 'జరిగిందేదో జరిగిపోయింది.. ముందుముందు చాలా పోటీలున్నాయి' అని విజయ్ సర్ చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తు. నేను సాధించగలనని ఆయన నాతో అన్నారు. ఆ తర్వాత జరిగే పోటీల్లో ఇంకా బాగా ఆడాలని నాకు నేను చెప్పుకొన్నా. నా మీద నేను నమ్మకం పెంచుకున్నా. ఇండియాకు తిరిగొచ్చాక మా అమ్మ నాతోనే ఉంది. నాలో చాలా స్ఫూర్తి నింపింది. విజయ్ సర్‌తో మాట్లాడిన తర్వాత నా టెక్నిక్, శిక్షణలో మార్పులు చేసుకున్నా. ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్‌గా ఎదిగా. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో నా ప్రదర్శన నాలో నమ్మకాన్ని మరింత పెంచింది. ఆ తర్వాత నేను ఆశలు వదులుకోలేదు.
లాక్డౌన్లో మీరు ఎదుర్కొన్న అత్యంత క్లిష్ట పరిస్థితి ఏంటి?
రెండు నెలల పాటు నా శిక్షణ నిలిచిపోయింది. వెయిట్‌లిఫ్టింగ్ వంటి క్రీడల్లో ప్రతి రోజు శిక్షణ లేకపోతే.. మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టాల్సి వస్తుంది. శిక్షణకు దూరంగా ఉండటం అత్యంత క్లిష్టంగా అనిపించింది. శరీరంలో కండలు తగ్గిపోయాయి. ఆ సమయంలో నేను పటియాలలో ఉన్నా. శిక్షణ పునఃప్రారంభించాలని విజ్ఞప్తి చేశా. వెంటనే శిక్షణ ప్రారంభించకపోతే ఆసియాన్ ఛాంపియన్షిప్ క్వాలిఫయర్స్, ఒలింపిక్స్ కోసం అన్నేళ్లు నేను పడిన శ్రమ వృథా అవుతుందని క్రీడా మంత్రిత్వశాఖకు వెల్లడించాను. రెండు నెలల తర్వాత శిక్షణ మొదలుపెట్టినప్పటికీ, కండరాల్లో సమస్య కారణంగా ఇబ్బంది పడ్డా. అది చాలా క్లిష్ట సమయం.
చాలా కాలం పాటు ఇంటికి దూరంగా గడిపారు. మీరు చేసిన అతిపెద్ద త్యాగం ఏంటి?
2016లో నేను వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన సమయం. నా సోదరి పెళ్లి నవంబర్ 27న జరిగింది. కానీ పోటీలు అదే నవంబర్‌లో ఉండటం వల్ల నేను పెళ్లికి వెళ్లలేకపోయా. ఇలా చాలా త్యాగాలు ఉన్నాయి. డైట్ కోసం నేను ఎంతో ఇష్టంగా తినే ఆహారాలను దూరం పెట్టా. పార్టీలు, ఫంక్షన్లకు వెళ్లేలేదు. ఫోన్ కూడా వాడలేదు. దేశానికి ఏదైనా చేయాలన్న తపన నాలో ఉండేది. అదే నన్ను ముందుకు నడిపించింది. శిక్షణపైనే శ్రద్ధ పెట్టా.
రాబోయే పారిస్ ఒలింపిక్స్ గురించి ఏమంటారు? స్వర్ణం సాధించాలని అనుకుంటున్నారా?
ప్రస్తుతానికి సిల్వర్‌తో సంతోషంగా ఉన్నా. 2022లో కామన్వెల్త్, ఆసియాన్ క్రీడలున్నాయి. వాటిల్లో మంచి ప్రదర్శన చేయాలి. ఆ తర్వాత పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ కోసం ప్రయత్నిస్తా.
మరి ఇప్పుడు మీ ప్రణాళికలేంటి?
ప్రస్తుతం అన్నింటిని ఆస్వాదిస్తున్నా. చాలా మందిని కలుస్తున్నా. ఎంతో ప్రేమతో నన్ను కలవడానికి వస్తున్నారు. వారితో సరదగా గడిపి.. త్వరలో మళ్లీ శిక్షణను ప్రారంభిస్తా.
ఇదీ చూడండి:- మీరాబాయి చాను బయోపిక్.. త్వరలో ప్రకటన!