టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వరుస (T20 worldcup latest news) విజయాలతో దూసుకుపోతోంది. టీమిండియా, న్యూజిలాండ్‌పై గెలుపొందిన ఆ జట్టు.. నేడు అఫ్గాన్‌స్థాన్‌పై నెగ్గి హ్యాట్రిక్ విజయాలను నమోదుచేసింది. అఫ్గానిస్థాన్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో ఛేదించింది. బాబర్ అజామ్ (51; 47 బంతుల్లో 4 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫకార్ జమాన్ (30), షోయబ్ మాలిక్ (19) ఫర్వాలేదనిపించారు. 19వ ఓవర్‌లో ఆసిఫ్ అలీ (25) నాలుగు సిక్స్‌లు బాది పాక్‌కు విజయాన్ని అందించాడు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్‌ఖాన్ రెండు, ముజీబుర్, నబీ, నవీన్ ఉల్ హక్ తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ఆరంభంలో కీలక వికెట్లు కోల్పోయినా.. ఆఖర్లో కెప్టెన్ మహమ్మద్ నబీ (35), గుల్బదిన్ నయిబ్ (35) ధాటిగా ఆడారు ఇమాద్ వసీమ్ వేసిన రెండో ఓవర్లో ఓపెనర్ హజ్రాతుల్లా జజాయి (0) డకౌటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మరో ఓపెనర్ మహమ్మద్ షెహజాద్ (8) కూడా ఔటయ్యాడు. షహీన్ అఫ్రిది బౌలింగ్‌లో అతడు బాబర్ ఆజామ్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అస్ఘర్ అఫ్గాన్ (10), రహ్మానుల్లా గుర్బాజ్ (10), కరీమ్ జనత్ (15) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. అప్పటికి అఫ్గాన్ స్కోరు 10 ఓవర్లకు 65/5గా ఉంది. ఆ తర్వాత దూకుడుగా ఆడుతున్న క్రమంలో నబీబుల్లా జద్రాన్ (22) కూడా ఔటయ్యాడు. షాదాబ్ ఖాన్ వేసిన 13వ ఓవర్లో అతడు మహమ్మద్ రిజ్వాన్‌కి క్యాచ్ ఇచ్చి క్రీజు వీడాడు. అయితే, ఆఖర్లో అఫ్గాన్ బ్యాటర్లు మెరుపులు మెరిపించారు. కెప్టెన్ మహమ్మద్ నబీ, గుల్బదిన్ నయిబ్ వేగంగా ఆడుతూ పరుగులు రాబట్టారు. ఆరంభంలో కట్టుదిట్టంగా బంతులేసిన పాకిస్థాన్ బౌలర్లు.. ఆఖర్లో పట్టు సడలించారు. దీంతో అఫ్గాన్ జట్టు చివరి 3 ఓవర్లలో 43 పరుగులు రాబట్టింది. దీంతో పాక్ ముందు అఫ్గాన్ జట్టు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచగలిగింది. పాక్ బౌలర్లలో ఇమాద్ వసీమ్ రెండు, షహీన్ అఫ్రిది, హ్యారిస్ రవూఫ్, హాసన్ అలీ, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీశారు.
ఇదీ చదవండి:PAK vs AFG T20: అయ్యో.. టికెట్ కొన్నోళ్లకే ప్రవేశం లేదు!