Neeraj Chopra Final: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ ఒలింపిక్ ఛాంపియన్, భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సత్తా చాటాడు. ఆదివారం ఉదయం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో.. రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకున్నాడీ 24 ఏళ్ల స్టార్. డిఫెండింగ్ ఛాంపియన్, గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ మరోసారి విజేతగా నిలిచి స్వర్ణం దక్కించుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం గెల్చిన వద్లెచ్ 88.09 మీటర్ల దూరం బల్లెం విసిరి మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించాడు.
పీటర్స్ బల్లెం విసిరిన 3 సార్లు.. 90 మీటర్ల మార్కు దాటాడు. చివరి అటెంప్ట్‌లో 90.54 మీటర్ల దూరం బల్లెం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో 90.21, రెండోసారి 90.48 మీటర్ల దూరం ఈటె విసిరాడు. మిగతా ఎవరూ ఆ మార్కును అందుకోలేదు. తొలి ప్రయత్నంలో విఫలమైన నీరజ్.. రెండు, మూడు అటెంప్ట్స్‌లో వరుసగా 82.39, 86.37 మీటర్ల దూరం ఈటెను విసిరాడు. ఇక నాలుగో ప్రయత్నంలో మంచి వేగం అందుకున్న నీరజ్.. 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఐదు, ఆరు ప్రయత్నాల్లోనూ నీరజ్ ఫౌల్ చేశాడు. అయినా రెండో స్థానంలోనే నిలిచి.. చరిత్ర సృష్టించాడు. మరో భారత జావెలిన్ త్రోయర్ రోహిత్ యాదవ్ ఆకట్టుకోలేకపోయాడు. మూడు రౌండ్ల తర్వాత పదో స్థానంలో నిలిచి నిష్క్రమించాడు. ఇతడి అత్యుత్తమ ప్రదర్శన 78.72 మీటర్లు మాత్రమే.
అంతకుముందు గ్రూప్-ఏ క్వాలిఫికేషన్ రౌండ్లో 88.39 మీటర్ల త్రో వేసిన నీరజ్.. ఒకే ఒక్క అటెంప్ట్‌తో నేరుగా ఫైనల్‌కు చేరాడు. గ్రూప్- బీ నుంచి పీటర్స్ 89.91 మీ.. జావెలిన్ విసిరాడు.
మరోవైపు పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్లో భారత అథ్లెట్ ఎల్దోస్ పాల్ నిరాశపరిచాడు. 9వ స్థానంలో నిలిచిన అతడు.. పతకం తేలేకపోయాడు. 16.79 మీటర్ల దూరం దూకడం అతడి అత్యుత్తమ ప్రదర్శన. మొదటి మూడు రౌండ్లు ముగిసేసరికి 9వ స్థానంలో నిలిచిన అతడు.. మరో మూడు అవకాశాలను దక్కించుకోలేకపోయాడు. అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ట్రిపుల్ జంప్ విభాగంలో ఫైనల్ చేరిన భారత తొలి అథ్లెట్ పాల్ కావడం విశేషం. 4x400 రిలే టీం విభాగంలో భారత్ 12వ స్థానంతో ముగించింది.
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెల్చిన రెండో భారత అథ్లెట్‌గా, పురుషుల విభాగంలో తొలి భారత ఆటగాడిగా నిలిచాడు నీరజ్ చోప్రా. 2003లో పారిస్ వేదికగా జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో లాంగ్ జంప్ విభాగంలో కాంస్యం గెల్చుకుంది అంజు బాబి జార్జ్. ఇప్పుడు నీరజ్ ఆమె కంటే మెరుగైన ప్రదర్శన చేశాడు. గతేడాది జపాన్ టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో భారత్ గర్వపడేలా చేశాడు నీరజ్. ఒలింపిక్స్‌లో స్వర్ణం దక్కించుకున్న భారత తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గిన రెండో భారత ఆటగాడిగానూ నిలిచాడు. అంతకుముందు 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం నెగ్గాడు షూటర్ అభినవ్ బింద్రా.
మోదీ ట్వీట్.. రజత పతకం గెల్చిన నీరజ్ చోప్రాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చరిత్ర సృష్టించిన నీరజ్‌ను ప్రశంసించారు ప్రధాని నరేంద్ర మోదీ. క్రీడల్లో భారత్‌కు ఈ పతకం ఎంతో ప్రత్యేకమైనదని కొనియాడారు. రానున్న టోర్నీల్లోనూ మంచి ప్రదర్శన చేయాలని ఆకాంక్షించారు మోదీ. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు సహా పలువురు ప్రముఖులు నీరజ్‌కు అభినందనలు తెలిపారు.
నీరజ్ శ్రమకు ఫలితం దక్కినందుకు ఆనందంగా ఉందని అన్నారు అతడి తల్లి సరోజా దేవి. నీరజ్ పతకం సాధిస్తాడని తమకు ముందే తెలుసని చెప్పారు. ప్రపంచ వేదికపై పతకం గెల్చిన నీరజ్ సొంత గ్రామమైన హరియాణాలోని పానీపత్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. అతడి కుటుంబసభ్యులు, గ్రామస్థులు డ్యాన్స్‌లు చేస్తూ సంతోషాన్ని పంచుకుంటున్నారు.
ఇవీ చూడండి: ఇకపై అంపైర్లకు స్పెషల్ కేటగిరీ.. టాప్‌లో ఎవరున్నారంటే?
టీమ్ఇండియా మరో సిరీస్ పట్టేస్తుందా.. వెస్టిండీస్‌తో రెండో వన్డే నేడే