Supreme Court On AIFF: ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్) వ్యవహారాలను పర్యవేక్షించేందుకు నియమించిన త్రిసభ్య కమిటీని రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. దాంతో పాటు ఆగస్టు 28న జరగాల్సిన ఏఐఎఫ్ఎఫ్ ఎన్నికలను వారం పాటు వాయిదా వేసింది. నామినేషన్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు వీలు కల్పించేలా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రడూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది.
అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య(ఫిఫా) కోరినట్లుగా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో కూడిన ఓటరు జాబితాను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఫిఫాతో చర్చల నేపథ్యంలో క్రీడా మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ నియమించిన రిటర్నింగ్ అధికారి ఉమేశ్ సిన్హాను.. కోర్టు నియమించినట్లే పరిగణించాలని స్పష్టం చేసింది. ఏఐఎఫ్ఎఫ్ రోజువారీ కార్యకలాపాల నిర్వహణను ఫుట్‌బాల్ ఫెడరేషన్ తాత్కాలిక సెక్రటరీ జనరల్ చేపట్టాలని ఆదేశించింది. ఏఐఎఫ్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో 23 మంది సభ్యులు ఉంటారని, ఇందులో ఆరుగురు ప్రముఖ క్రీడాకారులు, నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉంటారని పేర్కొంది.
FIFA Suspended AIFF: ఇటీవలే ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఏఐఎఫ్ఎఫ్ను ఫిఫా సస్పెండ్ చేసింది. ధర్డ్ పార్టీల నుంచి అనవసరమైన ప్రభావం ఉన్న కారణంగా.. ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ప్రకటనను విడుదల చేసింది. "ఫిఫా చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించిండం సహా థర్డ్ పార్టీల జోక్యం ఉన్నందున్న ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఏకగ్రీవంగా నిర్ణయించింది" అని ఫిఫా పేర్కొంది. అయితే కొద్దిరోజుల క్రితం ఫిఫాతో చర్చలు జరిపి అండర్-17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను దేశం దాటి వెళ్లకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది.
Supreme Court On IOA: మరోవైపు, భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) వ్యవహారాలకు సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐఓఏ వ్యవహారాలను చూసేందుకు దిల్లీ హైకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీకి బాధ్యతలు అప్పగించరాదని తెలిపింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ యథాతథ స్థితినే కొనసాగించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
భారత ఒలింపిక్ అసోసియేషన్ వ్యవహారాలను చూసేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అనిల్ దవే, మాజీ సీఈసీ ఖురేషీ, విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి వికాస్ స్వరూప్‌లతో కూడిన పాలనా కమిటీని దిల్లీ హైకోర్టు ఆగస్టు 16న ఏర్పాటు చేసింది. అయితే దిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఐఓఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దిల్లీ హైకోర్టు ఆదేశాలు.. దేశం పట్ల తప్పుడు సంకేతాలు వెళ్లేందుకు కారణమవుతాయని వాటిని నిలుపుదల చేయాలని.. ఐఓఏ కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టును అభ్యర్థించారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం.. యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది
ఇవీ చదవండి: సాయి ప్రణీత్ ఔట్, రెండో రౌండ్‌కు అశ్విని సిక్కిరెడ్డి జోడీ
నేటి నుంచే ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్, సవాల్‌కు సై