తెలంగాణ యువ అథ్లెట్లు నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డు రేసులో నిలిచారు. పురస్కారం కోసం వీళ్ల పేర్లను జాతీయ క్రీడా అవార్డుల ఎంపిక కమిటీ ప్రతిపాదించింది. మొత్తం 25 మంది అథ్లెట్ల పేర్లను అర్జున అవార్డు కోసం ప్రతిపాదించింది. ఖేల్‌రత్నకు టీటీ స్టార్ శరత్ కమల్ పేరును సిఫారసు చేసింది. ఈ కమిటీ ఎంపిక చేసిన అథ్లెట్లకు అవార్డులు అందడం దాదాపు ఖాయమే! బాక్సింగ్‌లో అదరగొడుతున్న 26 ఏళ్ల నిఖత్ ఈ ఏడాది ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.24 ఏళ్ల హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ టేబుల్ టెన్నిస్‌లో నిలకడగా రాణిస్తోంది. కామన్వెల్త్ క్రీడల మిక్స్‌డ్ డబుల్స్‌లో శరత్ కమల్‌తో కలిసి ఆమె స్వర్ణం సొంతం చేసుకుంది. ఈ ఏడాది జాతీయ ఛాంపియన్‌గా నిలిచి.. తెలుగు రాష్ట్రాల నుంచి ఆ ఘనత సొంతం చేసుకున్న తొలి మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. మరోవైపు బ్యాడ్మింటన్ స్టార్లు లక్ష్యసేన్, హెచ్‌ఎస్ ప్రణయ్, చెస్ సంచలనం ప్రజ్ఞానంద పేర్లనూ అర్జున కోసం ప్రతిపాదించారు.
జ్యోతి సురేఖకు నిరాశ
అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ జ్యోతి సురేఖకు మరోసారి నిరాశ ఎదురైంది. అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు కోసం ఆమె పేరును పరిగణలోకి తీసుకోలేదు. ఆ అవార్డు కోసం ఆమె చేసిన దరఖాస్తును ఆమోదించలేదు. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్ కాంపౌండ్ విభాగంలో ఆమె ఇప్పటికే ఆరు పతకాలు గెలిచింది. 2021లో ఒకే ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మూడు రజతాలు నెగ్గి.. ఆ ఘనత సాధించిన ఏకైక ఆర్చర్‌గా చరిత్ర సృష్టించింది. ఆసియా ఛాంపియన్‌షిప్స్, ప్రపంచ కప్‌ల్లో ఎన్నో పతకాలు సొంతం చేసుకుంది. కానీ అవార్డు విషయంలో మాత్రం మొండిచెయ్యే ఎదురైంది. కేవలం టేబుల్ టెన్నిస్ దిగ్గజ ఆటగాడు శరత్ కమల్ పేరును మాత్రమే ఖేల్‌రత్నకు ప్రతిపాదిస్తూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. గతేడాది 11 మంది పేర్లను కమిటీ ప్రతిపాదించింది. కానీ ఈ సారి కేవలం ఒక్క ఆటగాడి పేరునే సూచించడంతో శరత్ ఖేల్‌రత్న అవార్డు పొందడం ఖాయం.
ఇదీ చదవండి: T20 World Cup: భారత్ x జింబాబ్వే.. సెమీస్ రేసులో నిలిచేదెవరో?
T20 World Cup: ఆస్ట్రేలియా ఆశలు హుష్.. సెమీస్ బెర్తు ఇంగ్లాండ్‌దే..