Pranav Anand GM : దేశ చదరంగంలో మరో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) అవతరించాడు. బెంగళూరుకు చెందిన 15 ఏళ్ల ప్రణవ్ ఆనంద్ భారత 76వ గ్రాండ్ మాస్టర్‌గా నిలిచాడు. గ్రాండ్ మాస్టర్ హోదా సాధించాలంటే 2500 ఎలో రేటింగ్ పాయింట్లను దాటాలి. ప్రస్తుతం రొమేనియాలోని మమాయలో జరుగుతున్న వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో 2500 ఎలో రేటింగ్ పాయింట్లు దాటి ప్రణవ్ గురువారం ఈ ఘనత సాధించాడు.
జులైలో స్విట్జర్లాండ్‌లో జరిగిన బియెల్ చెస్ ఫెస్టివల్లో మూడో, తుది గ్రాండ్ మాస్టర్ నార్మ్ల పాయింట్లను స్కోర్ చేశాడు. స్పెయిన్‌కు చెందిన ఆటగాడు ఎడుర్డో ఇతుర్రిజాగా బొనెల్లితో (2619) జరిగిన మ్యాచ్‌లో గెలిచి ఈ స్కోర్ చేశాడు.
అదే ఈవెంట్లో ఫ్రాన్స్‌కు చెందిన లగార్డే మాక్సిమ్(2631), సేతురామన్ ఎస్పీపై (2623) గెలిచాడు. ఆర్యన్ చోప్రా(2610), ఆర్మేనియా ఆటగాడు షంత్ సర్గ్స్యన్తో (2661) మ్యాచ్ డ్రాగా ముగించాడు. మొదటి జీఎం నార్మ్‌లను 2022 జనవరిలో జరిగిన సిట్‌గెస్ ఓపెన్‌లో, 2022 మార్చ్‌లో జరిగిన మరో టోర్నమెంట్లో పూర్తి చేశాడు.
"అతడికి చెస్ అంటే చాలా ప్యాషన్. అందులో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. దాని కోసం ఎంత సమయమైనా కేటాయిస్తాడు. అతడు గేమ్స్‌లో కచ్చితమైన గణాంకాలను రూపొందించుకోవడంలో, తుది ఆటల్లో చాలా బాగా ఆడతాడు. ఈ రెండూ అతడి బలాలు. ఆనంద్ ఈ ఘనత సాధించడానికి మరో కారణం అతడి తల్లిదండ్రులు. వాళ్లు పట్టుదలతో చాలా సమయం అతిడిపై కేటాయించి సపోర్ట్ చేశారు. కరోనా కనుక లేకపోతే ప్రణవ్ సంవత్సరం ముందే గ్రాండ్ మాస్టర్ అయ్యేవాడు. నేను ఇప్పటివరకు చూసిన వాళ్లలో ఇతడు చాలా టాలెంటెడ్ బాలుడు" అని ఆనంద్ కోచ్ వి శరవణన్ చెప్పాడు.
ఇవీ చదవండి: జడేజా కోసం ఈ యువ క్రికెటర్ ఏం చేశాడో తెలుసా?
బాల్‌బాయ్‌గా మొదలుపెట్టి.. దిగ్గజ ప్లేయర్‌గా ఎదిగి.. ఫెదరర్ విజయ ప్రస్థానం